Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - వెలుగులోకి మరిన్ని వీడియోలు, కుర్చిలో కూర్చుని దర్జాగా..
Andhra News: పలు కేసుల్లో నిందితుడు బోరుగడ్డ అనిల్‌కు పీఎస్‌లో రాచమర్యాదలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఆలస్యంగా బయటకొచ్చాయి.
Royal Courtesy To Borugadda Anil In Police Station: బోరుగడ్డ అనిల్ (Borugadda Anil).. పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ హయాంలో ఏ యూట్యూబ్ ఛానల్‌లో చూసినా.. ఏ మీడియా ఇంటర్వ్యూల్లోనైనా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌లను అసభ్య పదజాలంతో దుర్భాషలాడాడు. విచక్షణ మరిచి బూతులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురి ఫిర్యాదు మేరకు వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 17 కేసులు అతనిపై నమోదయ్యాయి. అయితే, పోలీస్ స్టేషన్‌లో అతనికి రాచమర్యాదలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల విచారణ సందర్భంగా మరో ప్రాంతానికి తరలిస్తుండగా ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి బిర్యానీ తినిపించారన్న ఆరోపణలపై పోలీసులపై చర్యలు సైతం తీసుకున్నారు. తాజాగా, మరిన్ని వీడియోలు బయటకు వచ్చాయి.
విచారణ సమయంలో అరండల్‌పేట్ పీఎస్‌కు అనిల్‌ను తరలించగా.. అక్కడే బల్లపై పరుపు వేసి దుప్పటి ఇచ్చి పోలీసులు పడుకోబెట్టినట్లుగా వీడియోల ద్వారా తెలుస్తోంది. అటు, కుర్చీలో కూర్చుని దర్జాగా పోలీసులకు ఆదేశాలిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు కాగా.. సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు
కాగా, ఇటీవలే బోరుగడ్డ అనిల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. 3 రోజుల క్రితం మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించిన సమయంలో నిందితున్ని బిర్యానీ కోసం తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. మంగళగిరి కోర్టులో హాజరుపరిచి తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో గన్నవరంలోని ఓ రెస్టారెంట్లో విందు భోజనం పెట్టించారు. రిమాండ్ ఖైదీకి కోరిన భోజనం పెట్టేందుకు పెద్ద రెస్టారెంట్‌కు తీసుకువచ్చిన వీడియోలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. బోరుగడ్డకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తుండడంపై కొంతమంది టీడీపీ సానుభూతిపరులు సెల్ ఫోన్‌లో రికార్డు చేశారు. వీరిని చూసిన పోలీసులు వారిపైనే ఘర్షణకు దిగటం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఆ వీడియోలను డిలీట్ చేయాలని టీడీపీ సానుభూతి పరుల నుంచి పోలీసులు ఫోన్లు లాక్కుని మరీ విజువల్స్ డిలీట్ చేయించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ తతంగాన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు.
నేరారోపణలు ఉన్న వ్యక్తులపై ఉదాసీనంగా ఉండొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత పదే పదే హెచ్చరిస్తున్నా కొందరి అధికారుల తీరు మారడం లేదు. అటు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేక్ పోస్టులపైనా సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తాజాగా, కడప జిల్లా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.