Crime News: బెంగళూరులో బస్ కోసం వేచి చూస్తున్న వివాహితపై గ్యాంగ్ రేప్, ఇద్దరు నిందితుల అరెస్ట్
Bengaluru Woman Molestation | భర్తతో గొడవ పడి కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న వివాహితకు చేదు అనుభవం ఎదురైంది. బస్ కోసం వేచి చూస్తున్న మహిళను మభ్యపెట్టి అత్యాచారం చేసిన నిందితులు అరెస్టయ్యారు.

Bengaluru Woman GangRape Case | బెంగళూరు: నగరంలోని కేఆర్ మార్కెట్ ఏరియాలో ఓ వివాహితను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బెంగళూరు సిటీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తమిళనాడుకు చెందిన బాధితురాలు ఆదివారం రాత్రి 11:30 గంటలకు కేఆర్ మార్కెట్ సమీపంలో బస్సు కోసం వేచి చూస్తుండగా కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు.
బస్సు వివరాలు అడగడమే నేరమా!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యలహంకకు వెళ్లే బస్సు గురించి బాధితురాలు కేఆర్ మార్కెట్ వద్ద అడుగుతుంటే ఆ బస్టాప్ వేరే చోట ఉంటుందని చెప్పి ఆమెను తమ వాహనంలో తీసుకెళ్లారు. కొంతదూరం వెళ్లాక మహిళకు వారిమీద అనుమానం వచ్చి అరవగా.. ఆమె నోరు నొక్కేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమెను బెదిరించి పర్సు, మొబైల్ లాగేసుకున్నారు. ఆమె వద్ద నగలు తీసుకుని అనంతరం నిందితులు ఆమెపై సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించి, ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు.
నిందితులపై కఠిన చర్యలు తప్పవన్న సీపీ
ఈ ఘటనపై బెంగళూరు సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. బెంగళూరు సీపీ దయానంద ఆ వివాహితను షెల్టర్ హోమ్‌కు తరలించారు. బాధితురాలు భర్తతో గొడవ నుంచి కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో బస్సు కోసం ఒంటరిగా వేచి చూస్తున్న వివాహితను మభ్యపెట్టి, ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి అఘాయిత్యం చేశారని సీపీ తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కర్ణాటకలో దుమారం రేపిన బెంగళూరు ఘటన
వివాహితపై సామూహిక అత్యాచారం ఘటన కర్ణాటకలో రాజకీయ దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేదని, చేతకాని సీఎం సిద్ధరామయ్య అని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో ఇలాంటివి జరిగేవి కాదని కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. తనపై వచ్చిన విమర్శలపై సీఎం సిద్ధరామయ్య ఎదురుదాడికి దిగారు. బీజేపీ హయాంలో అసలు నేరాలు జరగలేదన్నట్లు కాషాయం నేతలు సుద్ధపూసల్లా మాట్లాడటం తగదన్నారు. సామాజిక స్పృహ లేని వ్యక్తులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. దోషులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. బెళగావి ర్యాలీలో ప్రసంగించిన సిద్ధరామయ్య.. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పనిచేస్తుంది. బీజేపీ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం తాము నిరంతరం కృషి చేస్తామన్నారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష నేత ఆర్. అశోక కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి. బాలికలు, మహిళలకు రక్షణ కరువైంది. ఇలాంటి ప్రభుత్వాన్ని నడిపేందుకు బదులు రాజీనామా చేయడం బెటర్ అని ఫైర్ అయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

