Crime News: గర్భిణీపై కూర్చుని చిత్రహింసలు పెట్టిన భర్త - కడుపులోంచి శిశువు బయటకొచ్చి మృతి, హైదరాబాద్‌లో దారుణం
Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గర్భిణీ అయిన భార్య కడుపుపై కూర్చొని ఓ వ్యక్తి దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.

Husband Brutally Killed Pregnant Woman In Hyderabad: హైదరాబాద్‌లో (Hyderabad) దారుణం జరిగింది. అనుమానంతో గర్భిణీ అయిన భార్యపై ఓ భర్త కర్కశంగా ప్రవర్తించాడు. భార్య కడుపు మీద కూర్చుని హింసించడంతో గర్భస్థ శిశువు కూడా కడుపులో నుంచి బయటకొచ్చి మృత్యువాత పడింది. భాగ్యనగరంలోని కుషాయిగూడ (Kushaiguda) పీఎస్ పరిధిలో ఈ నెల 18న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత దీన్ని అనుమానాస్పద మృతిగా భావించి విచారించిన పోలీసులు దర్యాప్తులో భర్తే హత్య చేసినట్లు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ (21)కు ఇన్‌స్టాగ్రామ్‌లో కాప్రాకు చెందిన స్నేహ (21)తో పరిచయం ఏర్పడింది. 2022లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తొలుత సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. 2023లో వీరికి ఓ బాబు పుట్టాడు. ఆ తర్వాత సచిన్ పని మానేసి జులాయిగా తిరగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు.
బిడ్డను అమ్మేందుకు ప్లాన్..
ఈ క్రమంలో తన బిడ్డను పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మాలని పథకం వేసి రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న స్నేహ కుషాయిగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి వారికి అప్పగించారు. అనంతరం అనారోగ్యంతో ఆ బాబు మృతి చెందాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వరుస గొడవలు జరగ్గా కొద్ది నెలలు వీరు దూరంగా ఉన్నారు. కాప్రాలో ఓ గది అద్దెకు తీసుకుని గతేడాది డిసెంబర్ 11 నుంచి మళ్లీ కలిసి ఉంటున్నారు. అయితే, భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న సచిన్.. గర్భం ఎలా దాల్చావంటూ అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆమె హత్యకు పథకం రచించాడు.
గర్భిణీ కడుపుపై కూర్చుని..
ఈ నెల 15న రాత్రి భార్యకు మద్యం తాగించాడు. 16న ఉదయం 5 గంటల సమయంలో భార్య కడుపుపై కూర్చున్నాడు. దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఈ క్రమంలో ఆమె కడుపులో ఉన్న బిడ్డ సైతం బయటకొచ్చి మృత్యువాత పడింది. అనంతరం ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వంటగదిలోని సిలిండర్‌ను తీసుకొచ్చి గ్యాస్ లీకయ్యేలా పైపును తీసి బయటకు పారిపోయాడు. అయితే, సిలిండర్‌లో గ్యాస్ అయిపోవడంతో అతని ప్లాన్ బెడిసికొట్టింది. ఈ నెల 18న గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్తపై అనుమానంతో కేసు నమోదు చేసి విచారించారు. నిందితుడు కాచిగూడలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.





















