Fuel Tax Rates: చమురొక కల్పవృక్షం, సర్కారు ఎంత సంపాదిస్తోందో మీరు ఊహించలేరు
గత ఆరు సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఆర్జించిన మొత్తం 36.66 లక్షల కోట్లు.
Tax On Petroleum Products: పెట్రోలియం ఉత్పత్తులను లక్ష్మీదేవి అవతారాలుగా చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే, పెట్రోలియం ఉత్పత్తులపై విధించే పన్నులతో కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు కళకళలాడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికైనా, రాష్ట్ర ప్రభుత్వానికైనా.. పన్నులు ఆర్జించే అతి పెద్ద సాధనం చమురు ఉత్పత్తులు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని తొలి 9 నెలల్లో (2022 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు) పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను ద్వారా కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 5.45 లక్షల కోట్లు ఆర్జించాయి.
పెట్రోలు & డీజిల్‌పై పన్నుల ఆదాయం
పెట్రోలియం ఉత్పత్తులపై గత ఐదేళ్లలో వివిధ రకాల పన్నులు విధించి, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం గురించి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ జాన్ బ్రిట్టాస్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగారు. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి ఈ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో, పెట్రోలియం ఉత్పత్తులపై (పెట్రోలు, డీజిల్‌పై పన్నులు సహా) పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 3,07,913 కోట్లు ఆర్జించిందని లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ. 2,37,089 కోట్లు ఆర్జించాయని లెక్కలు సమర్పించారు.
పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో ఉన్న కామధేను
2022-23 తొలి తొమ్మిది నెలల్లో రూ. 5,45,002 కోట్లు పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల రూపంలో రాగా... 2021-22లో రూ. 7,74,425 కోట్లు, 2020-21లో రూ. 6,72,719 కోట్లు, 2019-20లో నుంచి రూ. 5,55,370, 2018-19లో రూ. 5,75,632 కోట్లు, 2017-18లో రూ. 5,43,026 కోట్లు వసూలైనట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రాజ్యసభకు తెలిపారు. కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ లెక్కన, గత ఆరు సంవత్సరాల్లో పెట్రోలు & డీజిల్‌పై పన్నుల రూపంలో ప్రభుత్వాలు ఆర్జించిన మొత్తం 36.66 లక్షల కోట్లు.
సామాన్యులకు ఊరటేది?
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో అమాంతం పెరిగిన ముడి చమురు ధరలు బ్యారెల్ దాదాపు 150 డాలర్ల స్థాయి వరకు వెళ్లాయి. ఆ తర్వాత చల్లబడ్డాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్ల దిగువన ఉంది. అంటే, గరిష్ట స్థాయి నుంచి దాదాపు సగం పైగా తగ్గింది. ముడి చమురు రేట్లు పెరిగినప్పుడు దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం, ముడి చమురు ధరలు తగ్గిన తర్వాత మాత్రం దేశంలో ధరలను తగ్గించలేదు. సామాన్యులకు ఏ మాత్రం ఊరట లభించడం లేదు. రేట్ల పెంపు, తగ్గింపు పట్టింపు సామాన్యులకే గానీ ధనవంతులకు కాదు. కాబట్టి వాళ్లేమీ ఆందోళన పడలేదు. ధనవంతులు బాధ పడలేదు కాబట్టి ప్రభుత్వాలు కూడా చలించలేదు. దేశంలో చమురు రేట్ల పెంపు ఫలితంగా ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపునకు కారణమైంది. అంటే.. చమురు ధరల పెంపు వల్ల బాధితులు ఫైనల్‌గా సామాన్య ప్రజలే.
పెట్రోలియం ఉత్పత్తులు కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలకు అతి పెద్ద ఆదాయ వనరులు. దేశంలో సగటున లీటర్ పెట్రోల్ ధర రూ.97 (సగటు ధర అని ముందే చెప్పాం) కాగా, డీజిల్ లీటరు రూ. 90 కి లభిస్తోంది.
పెట్రోలు, డీజిల్, LPG (వంట గ్యాస్) ధరలను అంతర్జాతీయ ధరలతో ముడిపెట్టినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి తెలిపారు. 26 జూన్ 2010 నుంచి పెట్రోల్ & అక్టోబరు 19, 2014 నుంచి డీజిల్ ధరను నిర్ణయించురునే హక్కును ప్రభుత్వ చమురు కంపెనీలకు కేంద్రం ఇచ్చిందని మంత్రి వివరించారు.