UPI Payments: యూపీఐకి మార్పులు! AI జత చేస్తున్న ఆర్బీఐ - లాభాలు ఇవే!
UPI Payments: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను RBIమరింత బలోపేతం చేయబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)కి ఇంకొన్ని సొబగులు అద్దుతోంది.
UPI Payments:
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మరింత బలోపేతం చేయబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)కి ఇంకొన్ని సొబగులు అద్దుతోంది. కృత్రిమ మేథస్సును (Artificial Intellegence) జత చేయబోతోంది. సరళీకరించిన ఏఐ (AI) ద్వారా వృద్ధులు, దివ్యాంగులు ఇకపై సులభంగా లావాదేవీలు (Online Transactions) చేపట్టగలరని ఆర్బీఐ విశ్వాసంగా ఉంది. ఈ చర్యలు ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పాటు అందిస్తాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
యూపీఐలో సంభాషణా చెల్లింపుల వ్యవస్థను (Conversational Payments) ఆరంభించేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రతిపాదించారు. కృతిమ వ్యవస్థ ఆధారంగా మాట్లాడుతూనే భద్రత, సురక్షితమైన వాతావరణంలో లావాదేవీలు చేపట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. డిజిటల్ ఎకానమీలో కృత్రిమ మేథస్సు వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో యూపీఐ మరింత విస్తరించనుంది. సులభతరం అవ్వడంతో పాటు భారత డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో పరివర్తన తీసుకురానుంది.
స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్‌లో పనిచేసే యూపీఐ వ్యవస్థల్లో ఏఐ ఫీచర్ అందుబాటులోకి రానుంది. మొదట ఇంగ్లిష్, హిందీ ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోకి వస్తుంది. 'సంభాషణ పరమైన చెల్లింపుల అరంగేట్రం, ఆఫ్‌లైన్‌లో పనిచేసే యూపీఐ లైట్ గురించి ఆర్బీఐ గవర్నర్ చేసిన ప్రకటన భారత ఎకానమీ పునర్ నిర్మాణంలో కీలక ముందడుగు అవుతుంది' అని ఎఫ్‌ఐఎస్ ఇండియా డెవలప్‌మెంట్ హెడ్ రాజ్‌శ్రీ రెంగన్ అన్నారు. 'విప్లవాత్మకమైన ఈ చర్యలు డిజిటల్ పేమెంట్ వ్యవస్థ, ఆర్థిక సమ్మిళత్వాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి' అని పేర్కొన్నారు.
'సరళీకరించిన కృత్రిమ మేథస్సు ఆధారంగా పనిచేసే ఇంటర్‌ఫేస్ అనేక ఇబ్బందుల్ని తొలగిస్తుంది. వృద్ధులు, దివ్యాంగులు దీనికి త్వరగా అలవాటు పడతారు. సులభంగా యాక్సెస్ చేసుకోగలచరు' అని బ్యాంకు బజార్ సీఈవో ఆదిల్ శెట్టి అంటున్నారు.
యూపీఐ లైట్ (UPI Lite) లావాదేవీల పరిమితి రూ.200 నుంచి రూ.500కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 2022, సెప్టెంబర్లో ఎన్‌పీసీఐ దీనిని ఆరంభించింది. దీంతో తక్కువ విలువైన లావాదేవీలను టూ ఫ్యాక్టర్ అథెంటిసిటీ లేకుండానే చేసుకోవచ్చు. గతంలో రోజుకు రూ.200 వరకు పిన్ అవసరం లేకుండా అత్యంత వేగంగా ఈ లావాదేవీలు చేపట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని రూ.500కు పొడగించారు. యూపీఐ లైట్ పరిమితి రూ.2000ను అలాగే ఉంచింది. పేటీఎం, భీమ్ యాప్, గూగుల్ పే ఇతర యాప్స్‌లో యూపీఐ లైట్ అందుబాటులో ఉంది. కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండియన్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పటికీ ఈ సుదుపాయం ఉంది.
యూపీఐ లైట్‌ను మరింత ప్రమోట్ చేసేందుకు ఆర్బీఐ ఆఫ్‌లైన్ పేమెంట్స్‌ను తీసుకొస్తోంది. ఇందుకోసం నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. టెలికాం కనెక్టివిటీ బలహీనంగా ఉన్నా, అందుబాటులో లేకున్నా రిటైల్ డిజిటల్ లావదేవీలు చేపట్టేందుకు దీనిని వాడుకోవచ్చు. లావాదేవీల తిరస్కరణ సైతం తక్కువగానే ఉంటుంది.
Also Read: షాపులకు వెళ్లట్లా, అంతా ఆన్‌లైన్ షాపింగే - ఎక్కువగా ఆర్డర్ చేస్తోంది వీటినే!