Online Shopping: షాపులకు వెళ్లట్లా, అంతా ఆన్‌లైన్ షాపింగే - ఎక్కువగా ఆర్డర్ చేస్తోంది వీటినే!
'బ్యాక్ టు ఆఫీస్' కూడా ఆన్‌లైన్ ఆర్డర్లకు ఆజ్యం పోసింది
Online Shopping Craze : గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ చాలా వేగంగా పెరిగింది. కరివేపాకు నుంచి ఖరీదైన సెల్‌ఫోన్ వరకు, సోప్ నుంచి సోఫా సెట్ వరకు.. ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు ఎక్కువ మంది జనం. దీంతో ఈ-కామర్స్ కంపెనీలు ఏడాది పొడవునా పండగ చేసుకుంటున్నాయి.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ యూనికామర్స్ (Unicommerce) యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం... FY23లో (2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు) ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. విశేషం ఏంటంటే, 'బ్యాక్ టు ఆఫీస్' కూడా ఆన్‌లైన్ ఆర్డర్లకు ఆజ్యం పోసింది. కొవిడ్ టైమ్‌లో సొంత ఊర్లకు వెళ్లి 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేశారు చాలా కంపెనీల ఉద్యోగులు. ఎంప్లాయిస్ వెళ్లిపోవడంతో నగరాలు, పెద్ద పట్టణాలు ఖాళీ అయ్యాయి, ఆన్‌లైన్ ఆర్డర్లు తగ్గాయి. లాక్‌డౌన్ ఆంక్షలు ముగిసిన తర్వాత, ఆఫీసులన్నీ 'వర్క్ ఫ్రమ్ హోమ్' రద్దు చేసి, తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచాయి. దీంతో, ఉద్యోగస్తులు సొంతూర్లను విడిచిపెట్టి తిరిగి మెట్రోపాలిటన్, టైర్-1 సిటీస్‌కు మారారు. ఆ ప్రభావం ఆన్‌లైన్ షాపింగ్‌పైనా కనిపించింది.
ఆన్‌లైన్ షాపింగ్‌లో టైర్-1 నగరాలు ముందంజ
'వర్క్ ఫ్రమ్ హోమ్' ఫెసిలిటీ ముగిసినప్పటి నుంచి, టైర్-1 నగరాల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య వేగంగా పెరిగింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే, FY23లో టైర్-1 నగరాల్లో ఆర్డర్ సైజ్ 31.1 శాతం పెరిగినట్లు యూనికామర్స్ రిపోర్ట్ చెబుతోంది. టైర్-2, టైర్-3 నగరాల్లో ఆన్‌లైన్ షాపింగ్‌లో 23.3 శాతం, 22.4 శాతం జంప్ నమోదైంది. బ్రాడ్ బ్యాండ్, మొబైల్ డేటా సర్వీసులు దాదాపు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడం, మంచి సెల్‌ఫోన్లు తక్కువ రేటుకు దొరకడంతో కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనివల్ల టౌన్స్‌లోనూ ఆన్‌లైన్ షాపింగ్‌కు క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ-కామర్స్ కంపెనీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. స్థానిక వ్యాపారులను తమ నెట్‌వర్క్‌లోకి చేర్చుకుంటూ, ఎక్కువ వస్తువులను ఆన్‌లైన్ షాపింగ్ కోసం అందుబాటులోకి తెస్తున్నాయి. తద్వారా, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
ఈ-కామర్స్ ఇండస్ట్రీలో 26.2 శాతం వార్షిక వృద్ధి నమోదైందని యూనికామర్స్ నివేదికలో వెల్లడైంది. అదే సమయంలో, వార్షిక ప్రాతిపదికన GMV (గ్రాస్ మర్చండైజ్ వాల్యూ)లో 23.5 శాతం పెరుగుదల ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఆన్‌లైన్ షాపింగ్ చేసే కస్టమర్ల సంఖ్య పెరిగినా, చిన్న పట్టణాల్లో మాత్రం ఈ క్రేజ్ స్వల్పంగా తగ్గింది. గత ఏడాది టైర్-1, టైర్-2 పట్టణాల్లో ఈ-కామర్స్ వాటా వరుసగా 19.2 శాతం, 38.6 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 18.6 శాతం, 37.1 శాతానికి తగ్గింది.
ఎక్కువగా ఏం కొంటున్నారు?
లైవ్ మింట్ రిపోర్ట్ ప్రకారం... వినియోగదార్లు ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా ఆర్డర్ చేశారు. FY22తో పోలిస్తే FY23లో ఎలక్ట్రానిక్ వస్తువుల డిమాండ్ 46.8 శాతం పెరిగింది. ఆ తర్వాతే ఆరోగ్యం, అందానికి ప్రాధాన్యమిచ్చారు జనం. FY22తో పోలిస్తే FY23లో వ్యక్తిగత సంరక్షణ (Personal care) వస్తువుల డిమాండ్ 26.6 శాతం, సౌందర్య సాధనాలకు (Cosmetics) డిమాండ్ 18.9 శాతం జంప్ చేసింది.
మరో ఆసక్తికర కథనం: ముచ్చటగా మూడోసారీ ఊరట - రెపో రేట్ యథాతథం, EMIలపై అదనపు భారం లేదు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial