Bear Bazar: స్టాక్ మార్కెట్లో బేర్స్ విధ్వంసం.. రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి, ఎందుకంటే?
భారత స్టాక్ మార్కెట్లో సోమవారం అతిపెద్ద నష్టాన్ని చూస్తున్నాయి. సుదీర్ఘ బుల్ ర్యాలీ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్స్ రంగంలోకి దిగటంతో అనూహ్యంగా పతనాన్ని చూస్తున్నాయి
Monday Mega Crash: భారత స్టాక్ మార్కెట్లో సోమవారం అతిపెద్ద నష్టాన్ని చూస్తున్నాయి. సుదీర్ఘ బుల్ ర్యాలీ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్స్ రంగంలోకి దిగటంతో అనూహ్యంగా పతనాన్ని చూస్తున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో 2034 పాయింట్ల నష్టంలో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 593 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా విక్స్ సూచీ 9 ఏళ్ల గరిష్ఠాన్ని తాకింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.10 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది.
మార్కెట్ల పతనం అందుకే:
వాస్తవానికి ఇటీవల బలహీనమోన ఆర్థిక డేటా మధ్య అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీనికి తోడు అమెరికా రానున్న కాలంలో మానిటరీ పాలసీ కింద వడ్డీ రేట్లను వేగంగా సెప్టెంబర్ నుంచి తగ్గిస్తుందనే ఊహాగానాలు ఈ పరిస్థితులకు దారి తీశాయి. అమెరికాలో జూన్ డేటా ప్రకారం ఊహించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరగలేదని డేటా వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 17-18 మధ్య జరగనున్న సమావేశంలో అర శాతం వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించవచ్చను అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే గోల్డ్ మాన్ సాచ్స్, సిటీ గ్రూప్, జేపీ మోర్గన్ చేజ్ వంటి ప్రముఖ సంస్థలు సైతం సెప్టెంబర్, డిసెంబర్ సమావేశాల్లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఉండొచ్చని ఇప్పటికే సూచిస్తున్నాయి.
ప్రపంచ మార్కెట్ల పరిస్థితి:
JP మోర్గాన్ కూడా ఫెడ్ తదుపరి షెడ్యూల్ సమావేశానికి ముందు ఆఫ్-సైకిల్ రేటు తగ్గింపుకు బలమైన అవకాశాన్ని సూచించింది. గ్లోబల్ మార్కెట్లు ఫెడ్ జాగ్రత్త వైఖరికి ప్రతికూలంగా ప్రతిస్పందించాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ సోమవారం 14 శాతానికి పైగా పడిపోయింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ బిగుతును కొనసాగిస్తుందనే అంచనాలతో యెన్ ఒక శాతం కంటే ఎక్కువ ర్యాలీ చేసింది. US ఫ్యూచర్స్ పడిపోయాయి. S&P 500 ఫ్యూచర్స్ 2.64 శాతం తగ్గగా, నాస్డాక్ ఫ్యూచర్స్ దాదాపు 5 శాతం తగ్గాయి. చాలా మంది ఈ సారి షెడ్యూల్ మీటింగ్ ముందే ఫెడ్ రేట్ల తగ్గింపుకు వెళ్లొచ్చని బెట్ వేస్తుండగా, బలమైన కారణాలు లేకుండా ఇకపై రేట్ల తగ్గింపులను ఆపలేదని నిపుణులు ఊహిస్తున్నారు. ఇదే క్రమంలో వడ్డీ రేట్లను రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయిలో ఉంచాలన్న ఫెడ్ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి.
పెరిగిన మాంద్యం భయం:
ఈ క్రమంలో గోల్డ్‌మన్ సాచ్స్ ఆర్థికవేత్తలు వచ్చే ఏడాది అమెరికా మాంద్యం సంభావ్యతను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచారు. అయితే తిరోగమనానికి భయపడకుండా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు.
నిపుణుల అభిప్రాయం:
ప్రపంచ వ్యాప్తంగా చెడు వార్తల కారణంగా బేర్స్ రంగంలోకి దిగటంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్నాయని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. జపాన్‌లో వడ్డీ రేటు పెంపు తర్వాత, రివర్స్ యెన్ క్యారీ ట్రేడ్ భయం ప్రారంభ ఉత్ప్రేరకంగా నిలవగా.. అమెరికాలో అత్యంత పేలవమైన జాబ్ డేటా మాంద్యం ఏర్పడుతుందనే భయాలను మరింతగా పెంచిందని అన్నారు. ఈ క్రమంలో చైనా, యూరప్ ఇప్పటికే మందగమనంతో సతమతమవుతుండటంతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయని మీనా వెల్లడించారు.