Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Vizag Metro Rail | విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Vizag Metro Rail Project: అమరావతి: విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్, విజయవాడ మెట్రో రైల్ మొదటి దశ డీపీఆర్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదట విశాఖ మెట్రోరైల్ డీపీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించించింది. విశాఖ మెట్రో మొదటిదశలో 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34.4 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రోరైలు ఒకటో కారిడార్ గా డీపీఆర్‌లో ప్రభుత్వం పేర్కొంది.
రెండో, మూడో కారిడార్ల నిర్మాణం ఇలా
గురుద్వారా నుంచి పాతపోస్ట్ ఆఫీసు వరకూ 5.08 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ ను నిర్మించనున్నారు. మూడో కారిడార్ గా తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ వరకూ 6.75 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం 11,498 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రెండో దశలో 30.67 కిలోమీటర్ల మేర కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ కారిడార్ నిర్మాణం చేపడతారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం అనంతరం ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి కె.కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడ మెట్రో రైల్ డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం
అమరావతి: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్‌కు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును రెండు దశల్లో (కారిడార్ 1ఎ, 1బిగా) మొత్తంగా 38.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. విజయవాడ మెట్రో ఫేజ్ 1కు సంబంధించిన డీపీఆర్ను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ మెట్రో ఫేజ్ 1 వ్యయం
Vijayawada Metro Rail Project | విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తంగా రూ.11,009 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కారిడార్ 1ఎ, బి లాగ విజయవాడ మెట్రో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మెట్రో ప్రాజెక్టుకు భూసేకరణ కోసం రూ.1,152 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించేలా డీపీఆర్ సిద్ధం చేసింది. విజయవాడ మెట్రోరైలు రెండో దశలో భాగంగా మూడో కారిడార్‌ను దాదాపు 27.75 కిలోమీటర్ల మేర నిర్మించాలని సర్కార్ యోచిస్తోంది.
మెట్రో 1ఎ కారిడార్లో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు నిర్మిస్తారు. మెట్రో 1బిలో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు చేపడతారు. విజయవాడ మెట్రో మూడో కారిడార్ రెండు దశల్లో నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల తొలి దశకు సంబంధించి డీపీఆర్‌ను ఆమోదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ