AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Liquor Sales in Andhra Pradesh | అమరావతి: ఏపీలో మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మద్యం అక్రమంగా విక్రయిస్తే, అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానాలు విధించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎవరైనా మద్యాన్ని ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు జరిమానాలపై నోటిఫికేషన్ జారీ చేసింది.
లైసెన్స్ సైతం రద్దు చేస్తామని హెచ్చరిక
అధిక ధరలకు మద్యం విక్రయిస్తే భారీ జరిమానా విధిస్తామని ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే తప్పు మరోసారి చేస్తే ఆ మద్యం దుకాణం లైసెన్స్ సైతం రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ విషయాలను ఎపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. పర్మిషన్ లేని వాళ్లు బెల్ట్ షాపులు నడిపితే తాను బెల్ట్ తీయాల్సి వస్తోందని చంద్రబాబు అనంతపురం నేమకల్లులో పాల్గొన్న గ్రామసభలో ఇదివరకే స్పష్టం చేశారు.