Andhra News: ఏపీలో తొలిసారిగా ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ - పెండింగ్ సమస్యలపై చర్చ, విద్యుత్ బకాయిలపై తేలని పంచాయితీ
AP Reorganisation Act: విభజన అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎస్‌లు సహా అధికారులు ఏపీలో తొలిసారిగా భేటీ అయ్యారు. అపరిష్కృత అంశాలపై చర్చించారు.
AP And Telangana CS Meet On AP Reorganisation Act: ఏపీ పునర్విభజన చట్టంలోని (AP Reorganisation Act) అపరిష్కృత అంశాల పరిష్కారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. విభజన అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ సమావేశమైంది. మంగళగిరిలోని (Mangalagiri) ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో అధికారులు భేటీ అయ్యారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లో సంస్థల ఆస్తుల పంపకాలపై ప్రధానంగా చర్చించారు. పంపకం కాకుండా మిగిలిపోయిన రూ.8 వేల కోట్ల అంశంపై సైతం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, విద్యుత్ బకాయిలు, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంతో పాటు విభజన పూర్తి కాని సంస్థలకు చెందిన నగదు నిల్వలపైనా చర్చించారు.
వీటిపై అంగీకారం
దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 3 అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. రూ.861 కోట్ల మేర లేబర్ సెస్‌ను ఏపీ - తెలంగాణ మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల మార్పిడి పైనా సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది. ఎక్సైజ్ శాఖకు తెలంగాణ చెల్లించిన రూ.81 కోట్ల బకాయిల అంశం పరిష్కారమైంది. అదనంగా ఇచ్చిన రూ.81 కోట్లు తిరిగి చెల్లించినట్లు ఏపీ తెలిపింది. డ్రగ్స్ నివారణకు ఇరు రాష్ట్రాల పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయానికి వచ్చారు. మరో 2 అంశాలపైనా సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అయితే, కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పెండింగ్ అంశాలపై మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు సమాచారం. అటు, విద్యుత్ అంశాలకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఈ ఏడాది జులై 5వ తేదీన తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీకి కొనసాగింపుగా ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సీఎంల భేటీలో చర్చకు వచ్చిన అంశాలపైనా లోతుగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక భేటీలో ఏపీ నుంచి సీఎస్, ఆర్థిక శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్‌కో సీఎండీ, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ హాజరు కాగా.. తెలంగాణ నుంచి సీఎస్, ఆర్థిక, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శలు, ఇతర అధికారులు హాజరయ్యారు.
Also Read: YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్