YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణా జాతీయ కుంభకోణమని.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.
YS Sharmila Comments On Ration Mafia: రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఓ పెద్ద మాఫియా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమన్న ఆమె.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రేషన్ బియ్యం (Ration Rice) స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని.. పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తిని దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లు దీని వెనుక కింది నుంచి ఉన్నత స్థాయి వరకూ కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని విమర్శించారు. 'ఈ వ్యవహారంలో ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కుతుండడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరిగిందంటే.. మన చెక్ పోస్టుల పని తీరు ఎలా ఉందో అంచనా వెయ్యొచ్చు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.' అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా. ఇదో జాతీయ స్థాయి కుంభకోణం. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉంది. కింద నుంచి ఉన్నత స్థాయి…
— YS Sharmila (@realyssharmila) December 2, 2024
'దీని వెనుకున్న దొంగలెవరు.?'
'పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అక్రమంగా పోర్టు వరకూ ఎలా చేర్చారు.?. మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు.? దీని వెనుక ఉన్న దొంగలెవరు? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు.?, అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా.? తీగ లాగితే వెనుకున్న డొంక ఎక్కడ?. మిల్లర్ల చేతివాటం ఉందా?. రేషన్ డీలర్ల మాయాజాలమా? అనునిత్యం తనిఖీల సంగతేంటి.?. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ప్రపంచానికి అన్నం పెట్టే మన రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారు.' అని షర్మిల మండిపడ్డారు.
కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టును సందర్శించి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. సదరు షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. జగన్ ప్రభుత్వ హయాంలో చివరి మూడేళ్లలో కాకినాడ పోర్టు నుంచి రూ.48,537 కోట్ల విలువైన 1.31 టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతున్నట్లు చెప్పారు.