PV Sunil Kumar: రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ కుమార్
Raghurama Krishna Raju Custody Torture Case | రఘురామకృష్ణరాజుకు కస్టడీలో టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. రెండోసారి నోటీసులు రావడంతో గుంటూరు సీసీఎస్ పీఎస్ కు వచ్చారు.

Raghurama Custody Torture Case | గుంటూరు: సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసుల కస్టడీలో హింసించిన కేసులో సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిసిందే. ఈ కేసు విచారణను విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
గత నెల 26న డిసెంబర్ 4న విచారణకు హాజరు కావాలని తొలి నోటీసు జారీ చేయగా, కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నందున గడువు కావాలని ఐపీఎస్ సునీల్ కుమార్ కోరారు. ఈ నెల 6న రెండోసారి నోటీసు ఇచ్చి డిసెంబర్ 15న విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో సోమవారం (డిసెంబర్ 15) నాడు సునీల్ కుమార్ గుంటూరు సీసీఎస్ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు.
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు
2021లో గత ప్రభుత్వ హయాంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు రాజద్రోహం ఆరోపణల కింద అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో తనను తీవ్రంగా హింసించారని, ఈ క్రమంలో తన కాళ్లకు గాయాలయ్యాయని రఘురామ ఆరోపించారు. ఈ విషయంపై ఆయన కోర్టును ఆశ్రయించగా, అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ సమయంలో సీఐడీ అదనపు డీజీగా పనిచేసిన పి.వి. సునీల్ కుమార్‌పైనే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రఘురామకు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ వేగం పుంజుకుంది. ప్రస్తుతం రఘురామ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్నారు.






















