Lucky Draw Sarpanchs in Telangana: రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో రెండో విడత సర్పంచ్ ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా లక్కీ డ్రా సర్పంచ్ లకు అదృష్టం తెచ్చింది. కొన్ని చోట్ల కిడ్నాప్ డ్రామాలు వర్కవుట్ అయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో తాజాగా రెండో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా చిత్ర విచిత్రాలు ఎదురైయ్యాయి. ప్రధాన పార్టీలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకపోయినా, ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్దుల మధ్య హారా హోరీాగా పోరు జరగడం సర్వసాధారణం. అభ్యర్దులకు వచ్చిన ఓట్లే గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. అయితే ఈసారి తెలంగాణ రెండో విడత ఫలితాల్లో అనేక జిల్లాల్లో వింత పరిస్దితులు కనిపించాయి. పోటాపోటీగా ప్రచారం చేసినా, తాయిలాలతో ఓటర్లను ఆకర్షించినా , చివరకు లక్కీ డ్రాను నమ్ముకోవాల్సిన దుస్దితి ఏర్పడింది. ఓట్లు గెలుపు తెచ్చినా, లక్కీ డ్రాలు చిక్కులు తెచ్చాయి. అదృష్ణం ఉన్నవాళ్లు డ్రాలో గెలిచి సర్పంచ్ గా ఎన్నికైతే, ఓడించే ఓట్లు వచ్చినా అదృష్ణరేఖ సరిగ్గాలేక సరిపెట్టుకోవాల్సిన పరిస్దితి కొందరు అభ్యర్దులకు తప్పలేదు.

ఇద్దరూ సమానమే.. విజేతను తేల్చింది లక్కీ డ్రా..
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో బీఆర్ ఎస్ బలపర్చిన అభ్యర్ది రజినీకాంత్ కు 204 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన కావేరికి సైతం 204 ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించాల్సిన పరిస్దితి వచ్చింది. లక్కీ డ్రాలో కావేరి పేరు రావడంతో సర్పంచ్ పదవి వరించింది. ఓట్లు పోటీగా వచ్చినా, లక్కీ డ్రా దెబ్బకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది బీఆర్ ఎస్ బలపర్చిన అభ్యర్ది రజినీకాంత్ పరిస్దితి.
కామారెడ్డి జిల్లా యల్లారెడ్డి స్దానానికి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మంగలి సంతోష్ కుమార్, పెంట మానయ్యకు సమానంగా , ఒక్కోక్కరికి 483 ఓట్లు వచ్చాయి. రీ కౌంటింగ్ చేసినా అవే ఓట్లు రావడంతో చేసేది లేక చివరకూ టాస్ వేయాల్సి వచ్చింది. అధికారుల సమక్షంలో టాస్ లో గెలిచిన సంతోష్ కుమార్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైయ్యారు.
భర్త కిడ్నాప్ అయ్యాడని ప్రచారం..
మెదక్ జిల్లా చేగొండ మండలం గొల్లపల్లిలో బీఆర్ ఎస్ అభ్యర్ది బలపర్చిన సబిత విజయం సాధించింది. అయితే ఇక్కడ విడ్డూరం ఏంటంటే పోలింగ్ రోజు ఉదయం తన భర్త కిడ్నాప్ అయ్యాడని కట్టుకథ అల్లి, హంగామా చేసిన సబిత, ఆ సానుభూతితోనే సర్పంచ్ గా గెలుపొందిందని గ్రామస్దులు ఆరోపిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం లంబాడి తాండా గ్రామంలో బలరామ్ , రామ్ చందర్ లకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ 193 ఓట్లు రావడంతో ఇక్కడ కూడా లక్కీ డ్రా పెట్టాల్సి వచ్చింది. అధికారుల సమక్షంలో జరిగిన లక్కీ డ్రాలో బలరామ్ పేరు రావడంతో సర్పంచ్ పదవి వరించింది.
విజేతను తేల్చిన టాస్
నల్గొండజిల్లా మంగాపురం సర్పంచ్ స్దానానికి కాంగ్రెస్ మద్దతుతో పోటీలో నిలిచిన చక్కని ఉపేంద్రమ్మ, బీఆర్ ఎస్ మద్దతుతో పోటీచేసిన మౌనికకు సమానంగా ఓట్లు పోలైయ్యాయి. ఓక్కొక్కరికీ 352 ఓట్లు రావడంతో , మొదటి రీ కౌంటింగ్ నిర్వహించినా, తిరిగి మళ్లీ సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేశారు. టాస్ లో ఉపేంద్రమ్మ పేరు రావడంతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్ది ఉపేంద్రమ్మ సర్పంచ్ గా ఎన్నికైయ్యింది.
మెదక్ జిల్లా చీపురుదబ్బ తాండా సర్పంచ్ అభ్యర్దిగా బీఆర్ ఎస్ బలపర్చిన భీమిలీ, కాంగ్రెస్ బలపర్చిన కేతావత్ సునీత పోటీపడగా, వీరికి ఒక్కొక్కరికిగా సమానంగా 182 ఓట్లు వచ్చాయి. అధికారులు లక్కీ డ్రా నిర్వహించగా కేతావత్ సునీత సర్పంచ్ పీఠం దక్కించుకుంది. వికారాబాద్ మండలం జైదుపల్లిలో సైతం ఇదే పరిస్దితి ఎదురైయ్యింది. పట్లోళ్ల మౌనిక వర్సెస్ నాగిరెడ్డికి మధ్య జరిగిన పోటీలో సమానాంగా 302 ఓట్లు రాడంతో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో మౌనికకు అదృష్ణం వరించింది. ఇలా తెలంగాణలో రెండో విడత పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో లక్కీ డ్రాలు, కిడ్నాప్ డ్రామాలు, టాస్ లు అభ్యర్దుల గెలుపును డిసైడ్ చేశాయి. ఇదిలా ఉంటే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, లక్కీ డ్రాలో అదృష్టం వరించిన అభ్యర్దుల్లో ఎక్కవ మంది అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్లులు కావడం మరో విచిత్రంగా చెప్పవచ్చు.





















