Telangana Panchayat Elections 2025: సర్పంచ్‌గా నెగ్గిన చనిపోయిన వ్యక్తి, కొడుకుపై తండ్రి.. అత్తపై కోడలు విజయం.. పంచాయతీ ఎన్నికల్లో సిత్రాలు..
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో దశలోనూ ఫలితాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. అత్త మీద కోడలు విజయం, కుమారుడిపై తండ్రి గెలుపొందడం లాంటి విశేషాలున్నాయి.

Telangana Panchayat Elections 2025 | హైదరాబాద్: తెలంగాణలో జరిగిన రెండు విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతుదారులు అధిక స్థానాల్లో గెలుపొందగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలుడగా 415 గ్రామ సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో 3,911 సర్పంచులు, 29,917 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం ఓటర్లు 54,40,339కు గాను 46,70,972 మంది ఓటు వేసి ఫలితాలు డిసైడ్ చేశారు.
రెండో విడతలో 85.86 శాతం పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ 11న జరిగిన మొదటి విడతలో నమోదైన 84.28 శాతం కన్నా ఇది 1.58 శాతం ఎక్కువ. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ 2,297 సర్పంచ్, బీఆర్ఎస్ 1,191, బీజేపీ 257, ఇతరులు 578 సర్పంచ్ స్థానాలు నెగ్గారు. వీరిలో సీపీఐ మద్దతుతో 28 మంది, సీపీఎం మద్దతుదారులు 33 చోట్ల గెలుపొందారు. చాలాచోట్ల ఇద్దరు అభ్యర్థులకు ఓకే సంఖ్యలో ఓట్లు రావడంతో డ్రా తీయడం, లేక టాస్ వేయడం ద్వారా విజేతను నిర్ణయించారు. పలుచోట్ల కేవలం ఒక్క ఓటు తేడాతో విజేతగా నిలిచి సంబరాలు చేసుకున్నారు.
తప్పిన ఏకగ్రీవం.. ఒకే ఒక్క ఓటుతో గెలుపు
వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆశాలపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. గ్రామంలో ఏకైక ఎస్సీ ఓటర్‌గా ఉన్న కొంగర మల్లమ్మ సర్పంచ్‌గా ఏకగ్రీవం అవుతారని ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆమె ఏకగ్రీవం అని అంతా భావించారు. అయితే, చివరి క్షణంలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక ఎస్సీ యువతి పోటీలోకి రావడంతో ఏకగ్రీవం తప్పింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఈ పోరులో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన కొంగర మల్లమ్మకు 824 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థికి 823 ఓట్లు రాగా, మొదట ఏకగ్రీవం అనుకున్న మల్లమ్మ చివరకు ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా విజయం సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు.
తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..
తెలంగాణలో డిసెంబర్ 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు 2,334 మంది గెలుపొందగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారులు 1,69 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 189 మంది సర్పంచులుగా గెలుపొందారు. ఇతరులు 538 మంది సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం తెలిసిందే.
సర్పంచ్ ఎన్నికల్లో నెగ్గిన చనిపోయిన వ్యక్తి
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్ పల్లిలో 9 ఓట్ల తేడాతో సర్పంచ్ గా చల్కి రాజు గెలుపొందారు. అయితే కాంగ్రెస్ మద్దతు తెలిపిన చల్కిరాజు ఇటీవల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఇక్కడ మరోసారి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
అత్తపై విజయం సాధించిన కోడలు
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఘన్ శ్యాందాస్ నగర్‌లో అత్త నర్సమ్మపై కోడలు రమ 18 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఎన్నికల్లో నెగ్గిన చనిపోయిన అభ్యర్థి
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండం మంచర్లగూడెంలో 8వ వార్డు నుంచి పోటీ చేసిన పల్లె లత వార్డు సభ్యురాలిగా నెగ్గారు. డిసెంబర్ 7న ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుండెపోటు రావంతో లత మృతిచెందారు.
సర్పంచ్ ఎన్నికల్లో ఓటమితో అభ్యర్థి మృతి
ఆ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటమిచెందిన బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందారు. మునుగోడు మండలం కిష్టాపురంలో సర్పంచ్ ఎన్నికల్లో చెన్నగోని కాటంరాజ్ ఓడిపోయారు. తీవ్ర మనస్తాపానికి లోనన కాటంరాజ్ కు ఛాతీలో నొప్పి రావడంతో చనిపోయారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామం చెర్లపాలెంలో రెబల్ క్యాండిడెట్ మహేందర్ విజయం సాధించారు.
కుమారుడ్ని ఓడించిన తండ్రి.. మూడోసారి సర్పంచ్‌గా
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ పంచాయతీ ఎన్నికల్లో కుమారుడిపై తండ్రి విజయం సాధించారు. కుమారుడు వెంకటేశ్ పై తండ్రి రామకిష్టయ్య గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతుదారు అయిన రామకిష్టయ్య మూడోసారి ఝాన్సీలింగాపూర్ సర్పంచ్‌గా విజయం సాధించారు.






















