Telangana Panchayat Election Results: పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు
Jupally Krishna Rao | సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనం అని, చాలాచోట్ల పనులు ఇంకా మొదలుపెట్టాల్సి ఉన్నా నమ్మకంతో కాంగ్రెస్‌ను గెలిపించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Telangana Panchayat Election Results | కొల్లాపూర్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చిన్నంబావిలో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందని, ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజల సంతోషమే లక్ష్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. మిగిలిన హామీల్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలోనే అమలు చేస్తుందన్నారు. చాలాచోట్ల ఇంకా పనులు మొదలుపెట్టాల్సి ఉందన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ, సమర్థతతో పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లో గట్టి నమ్మకం, విశ్వాసం ఏర్పడిందనడానికి ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శమని జూపల్లి పేర్కొన్నారు.
50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం
కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన మొదటి, రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నియోజకవర్గంలో 50 చోట్ల (3 స్వతంత్రులను కలిపి) అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవగా, 28 స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు. రెండు సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చుతున్నాయని, కొన్ని పనులు ఇంకా ప్రారంభదశలో ఉన్నాయని తెలిపారు.
త్వరలోనే చిన్నంబావి పనులు చేపడతాం..
చిన్నంబావికి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశాం. పనులకు టెండర్లు ఆహ్వానించాం. ఆర్ అండ్ బీకి రూ.200 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.100 కోట్లతో పనులు చేపడుతున్నాం. వాటి నుంచి చిన్నంబావి మండలం అభివృద్ధి పనులకు కేటాయించాం. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు మేం మద్దతు తెలిపిన అభ్యర్థులు మూడింట రెండు వంతులు గెలుపొందుతూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ముగ్గురిలో ఇద్దరు కాంగ్రెస్‌కు ఓటు వేశారన్న మంత్రి..
కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి పాత 4 మండలాలు కోడేరు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, పెంట్లవెల్లిలో 78 సర్పంచ్ స్థానాలుండగా 47 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా 28 స్థానాలు నెగ్గాయి. ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఛాన్స్ రాలేదని సొంతంగా పోటీచేసి విజయం సాధించారు. విత్ డ్రా చేసుకోకుండా బరిలోకి దిగి మా పార్టీ వాళ్లే నెగ్గడంతో మొత్తం 50 స్థానాలు మేం నెగ్గాం. కాంగ్రెస్ సింగిల్ గా పోటీ చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. రెండేళ్ల పాలనకు ప్రజలు ఓటు వేసి సర్పంచులుగా గెలిపించడంపై హర్షం వ్యక్తం చేశారు. మిగతా 3 ఏళ్లలో మరిన్ని అభివృద్ధి పథకాలు అమలు చేయడంతో పాటు మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. ముగ్గురిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటే, మిగతా ఒక్కరు బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓట్లు వేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.






















