Rajahmundry News; నువ్వో సుడిగాడివి- నువ్వే ఈవీఎం ఎమ్మెల్యేవి; రాజమండ్రి నేతల మధ్య వార్
Rajahmundry News:రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ల మధ్య మాటల యుద్థం నడుస్తోంది. ఆసుపత్రిలో సౌకర్యాలతో మొదలైందీ వార్.

Rajahmundry News: తూర్పుగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గం అయిన రాజమహేంద్రవరంలో ఇప్పుడు మాటల మంట రేగుతోంది. రాజమండ్రి అర్బన్ అధికార టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం తీవ్రతరమైంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల వేదికతోపాటు మీడియా సమావేశాల్లోనూ వదలడం లేదు. ఆదిరెడ్డి వాసు భరత్‌ను సుడిగాడు అంటే ఈవీఎం ఎమ్మెల్యే నువ్వు అంటూ ఒకరిపై ఒకరు మాటలతో చెలరేగిపోతున్నారు. ఇటీవల కాలంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిపై వీరిద్ధరి మధ్యరాజుకున్న వివాదం భూ సేకరణ, అభివృద్ధి తదితర అంశాలపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది...
ఓ యువకుడు పెట్టిన వీడియోతో మొదలు..
రాజమండ్రికి చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇటీవల రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో దుస్థితిపై ఓ వీడియో తీసి కూటమి ప్రభుత్వం స్పందించాలని ఓ వీడియో పోస్టు చేశాడు. దానికి స్పందించిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆ యువకుడితో లైవ్‌లో వివరణ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా బెడ్‌లు లేవని, పేషెంట్స్ కటిక నేలమీద పడుకుంటున్నారని ఆయువకుడు ఆ వీడియోలో చూపించాడు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే అది ఐసోలేషన్ వార్డులో అనారోగ్యం క్షీణించిన పేషెంట్స్ ఉంటుంటారని, అయితే అక్కడ ఉన్నవారి గురించి తమ దృష్టికి కూడా రాకుండా చేసి ఉంటారని, అయితే ఇప్పటికే ఆసుపత్రికి సంబందించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూటమి పార్టీలకు చెందిన నలుగురిని కమిటీగా నియమించామని ఆదిరెడ్డి తెలిపారు.
ఈ వివాదంపై మాజీ ఎంపీ భరత్ స్పందించి ఎవరి ఆరోగ్య పరిస్థితి అయినా క్రిటికల్‌గా ఉంటే వారికి ఎమర్జన్సీ వార్డులో పెడతారని, అయితే ఐసోలేషన్ వార్డులో ఎందుకు పెడతారని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఏంమాట్లాడతున్నాడో ఆయనకే తెలియడం లేదని విమర్శించారు. దీంతో దానికి బదులిచ్చిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి నువ్వో సుడిగాడివని, నీ వెనుక కొందరిని వేసుకుని సుడిగాడిలా తిరగడమే నీ పని కానీ ఏనాడైనా ప్రభుత్వ ఆసుపత్రి బాగోగులు గురించి పట్టించుకున్నావా అంటూ మండిపడ్డారు. ఇక్కడ ఇద్దరి మధ్య రాజుకున్న మాటల యుద్ధం కోనసాగుతూనే ఉంది.
నువ్వు సుడిగాడివి- నువ్వు ఈవీఎం ఎమ్మెల్యేవి
రాజమండ్రికి సుడిగాడు ఎవరంటే భరత్‌రామ్ అని, అతను వస్తే జనం పరుగెడతారని వ్యగ్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడిన మాటలకు భరత్ కౌంటర్ ఇచ్చారు.. నువ్వు ఈవీఎం ఎమ్మెల్యేవంటూ మాజీ ఎంపీ భరత్‌రామ్ విమర్శించారు. తాను ఇంగ్లీష్‌లో చిన్న తప్పు మాట్లాడితే దానిని వ్యగ్యంగా మాట్లాడుతూ వీడియో చేయడం కేవలం లైక్‌ల కోసమేనని ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. తాను ఇంగ్లీషులో తప్పు మాట్లాడితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిన సీఎస్సార్ నిధులు ఏమైనా ఆగిపోయాయా అని ప్రశ్నించారు. ఏదైనా వీడియో చేసి దానికి లైక్‌లు వచ్చాయా లేదా చూసుకుని మురిసిపోయే సోషల్ మీడియా సుడిగాడివి అంటూ ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్‌గా మాలలో ఉండి కూడా బూతులు మాట్లాడే వాడిని నిన్నే చూశానంటూ ఆదిరెడ్డి మాట్లాడిన వీడియోను తన సోషల్ మీడియాఖాతాల్లో పోస్టులు పెట్టారు భరత్..
ఒక ఎంపీ ఎలా ఉండాలో పురంధేశ్వరిని చూసి నేర్చుకో..
వైసీపీ ఎంపీగా ఉన్న నీ సమయంలో 2022 తరువాత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఏమైనా ఎంపీ ల్యాడ్స్ నిధులు రప్పించావా అంటూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి విమర్శించారు. ఒక ఎంపీ ఎలా ఉండాలో అన్నది రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని చూసి నేర్చుకో అంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను ఎద్దేవా చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఏమి కావాలో ఎంపీ పురంధేశ్వరి నేరుగా అడిగి దూరదృష్టితో అన్ని విభాగాల్లోనూ సమస్యలు పరిష్కరించేందుకు రూ.2 కోట్లు విలువచేసే పరికరాలు ఎంపీ ఇచ్చారన్నారు.
మీకు రాజకీయ భిక్ష పెట్టింది జగన్..
ఆదిరెడ్డి కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డిపై మాజీ ఎంపీ భరత్ ఫైర్ అయ్యారు. అవకాశవాదిగా అదను చూసుకుని టీడీపీలోకి జంప్ అయ్యింది మీరు అని, వైసీపీలో నీ తండ్రి ఎమ్మెల్సీ పదవిని పొంది పార్టీ మారారని మండిపడ్డారు. మీ పార్టీలోనే సీనియర్ నేత అయిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి గతంలో వెన్నుపోటు పొడిచావన్నారు. కూటమిలో స్కీమ్‌లు లేవు కానీ స్కామ్‌లు మాత్రం బాగా చేస్తున్నారన్నారు.






















