IPL 2025 MS Dhoni 400th T20: అరుదైన ఘనత ముంగిట ధోనీ.. సన్ రైజర్స్ తో నేటి మ్యాచ్ ధోనీకి ప్రత్యేకం.. రోహిత్, కోహ్లీ సరసన చేరనున్న తలా
శుక్రవారం మ్యాచ్ లో విజయం సాధించాలని చెన్నై పట్టుదలగా ఉంది.ఈ సీజన్ ఆ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో ఆరింటిలో పరాజయం పాలై, పట్టికలో పదో స్తానంలో నిలిచింది.

IPL 2025 SRH VS CSK Updates: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత ముందు నిలిచాడు. ఐపీఎల్లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో సీఎస్కే కెప్టెన్ గా వ్యవహరించబోతున్న ధోనీ.. టీ20 కెరీర్ లో అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. భారత్ తరపున 400 టీ20 మ్యాచ్ లు ఆడిన నాలుగో క్రికెటర్ గా ధోనీ నిలవనున్నాడు. అందరికంటే అధికంగా, రోహిత్ శర్మ (456), దినేశ్ కార్తీక్ (407), విరాట్ కోహ్లీ (407) మాత్రమే ఇప్పటికి ఈ ఘనత సాధించారు. ఓవరాల్ గా 24వ ప్లేయర్ గా ఈ మైలురాయిని ధోనీ చేరుకోబోతున్నాడు. తన కెరీర్ లో టీమిండియా, సీఎస్కే, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, దేశవాళీ జార్ఖండ్ తరపున వివిధ టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇప్పటివరకు 399 మ్యాచ్ లు ఆడిన ధోనీ 38కిపైగా సగటుతో 7,566 పరుగులు చేశాడు. ఇందులో 28 అర్థ సెంచరీలు ఉండగా, అత్యధిక స్కోరు 84 నాటౌట్ కావడం విశేషం. అలాగే వికెట్ కీపర్ గా 318 డిస్మిసల్స్ లో పాలు పంచుకోవడం విశేషం.
🚨 MILESTONE MATCH FOR MS DHONI 🚨
— Johns. (@CricCrazyJohns) April 25, 2025
- CSK Captain Dhoni will be playing his 400th T20 match today, One of the Greatest ever 🐐 pic.twitter.com/ngFKdbtuaV
దిగ్గజ కెప్టెన్..
టీమిండియా తరపున ధోనీ దిగ్గజ కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. జట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ లను అందించి, ఈ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్ గా నిలిచాడు. ఇక టీ20 ఫార్మాట్లో 5 ఐపీఎల్ టైటిల్స్, రెండు చాంపియన్స్ లీగ్ టైటిళ్లను సాధించాడు. 2008 నుంచి 2023 వరకు సుదీర్ఘంగా సీఎస్కే ను నడిపించిన ధోనీ.. మళ్లీ ఈ సీజన్ లో తప్పనిసరి పరిస్థితుల్లో కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. దీంతో 43 ఏళ్ల వయసులో కెప్టెన్ గా వ్యవహరించిన ప్లేయర్ గా ఐపీఎల్ రికార్డు నమోదు చేశాడు.
ప్రపంచ రికార్డు ఆ ప్లేయర్ పేరుపై..
ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టీ20లు ఆడిన ప్లేయర్ గా వెస్టిండీస్ గ్రేట్ కీరన్ పొలార్డ్ (695) పేరిట ప్రపంచ రికార్డు ఉంది. అతను ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు మెంటార్ గా సేవలందిస్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో విండీస్ కే చెందిన డ్వేన్ బ్రావో (582), పాకిస్థాన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ 9557) పేరు ఉంది. ఇక శుక్రవారం మ్యాచ్ అటు ఎస్ఆర్ హెచ్, ఇటు సీఎస్కేలకు కీలకమైనది కావడం విశేషం. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు దాదాపుగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చేపాక్ లో ఈ మ్యాచ్ జరుగుతుండటం, ఇక్కడ సన్ రైజర్స్ ఎప్పుడూ గెలిచిన రికార్డు లేకపోవడంతో ఈ మ్యాచ్ లో విజయంపై సీఎస్కే ధీమాగా ఉంది.




















