Kuppam News: కుప్పంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా, 384 మంది ఒకేసారి
AP Latest News: రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పం ఎమ్మెల్యే గా భరత్ గెలుపు కోసం రాజీనామా చేసినట్లు వాలంటీర్లు స్పష్టం చేశారు.

Volunteers Resign in Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో ముక్కుముడిగా వాలంటీర్లు రాజీనామా చేశారు. దాదాపు 384 మంది వాలంటీర్లు ఒకేసారిగా రాజీనామా చేయడం సంచలనం అయింది. తాము రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు వాలంటీర్లు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పం ఎమ్మెల్యే గా భరత్ గెలుపు కోసం రాజీనామా చేసినట్లు వాలంటీర్లు స్పష్టం చేశారు.
మరోవైపు, కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడానికి వాలంటీర్లను నియమించారని భరత్ అన్నారు. ‘‘ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది చంద్రబాబు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని, కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబే. మళ్ళీ పెన్షన్ లబ్ధిదారులకు సహాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యం. రూ.6 మజ్జిగ ఇచ్చి నువ్వు ఓట్లు అడిగితే, మేం సంక్షేమ పథకాల ద్వారా లక్షల రూపాయలు ఇచ్చి ఓట్లు అడగకూడదా??’’ అని ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లు పింఛన్లు, రేషన్ బియ్యం పంపిణీలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశాలు ఉన్నాయి. దీంతో అసహనం వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా వాలంటీర్లు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ పార్టీకి పనిచేయకూడదని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లపై కూడా నిఘా పెట్టారు. దీంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనుకునే వాలంటీర్లు అందరూ రాజీనామాలు చేస్తున్నారు. అలా రాజీనామాలు చేసి వైఎస్ఆర్ సీపీ కోసం పని చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు 1500లకు పైగా వాలంటీర్లు రాజీనామా చేయగా.. తాజాగా కుప్పంలోని 384 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

