YSRCP Walk Out: గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్, జగన్ ఈ సెషన్స్‌లో మళ్లీ కనిపించరా?
YS Jagan Mohan Reddy | ఏపీ అసెంబ్లీ నుంచి జగన్ సహా వైఎస్సార్ సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ నినాదాలు చేసిన అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు.

AP Assembly Budget Session | అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్ద కాసేపు ఆందోళన చేసిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశారు.
10 నిమిషాల పాటు నిరసన తెలుపుతూ నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రజలు కూటమికి అధికారం అప్పగించారని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమం చేస్తూనే అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
జగన్ ఈ సెషన్స్ లో ఇక కనిపించరా..?
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్షనేత హోదా ఇవ్వాలని ఆ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిపక్ష హోదా కోసం నినదించారు. కొద్దిసేపు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. తమ పార్టీకి జరిగిన అన్యాయాన్ని అంతా చూస్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే జగన్ మళ్లీ సమావేశాలకు హాజరవుతారో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్కరోజే అసెంబ్లీకి హాజరు కావాలని భావించారని, ఎలాగూ ప్రతిపక్ష హోదా ఇవ్వరు, మరోవైపు వరుసగా 60 రోజులు సభకు రాకపోతే వేటు పడుతుందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నేడు హాజరయ్యారని వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

