Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam
వైట్ బాల్ క్రికెట్ లో ఆల్ టైమ్ గ్రేట్ గా పేరు సంపాదించుకున్న కింగ్ విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తర్వాత స్థానానికి చేరుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20 లు కలిపి అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు విరాట్. న్యూజిలాండ్ తో ఆదివారం జరిగిన మొదటి వన్డేలో 93పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఈ క్రమంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ కుమార సంగక్కర ను వెనక్కి నెట్టి ఆల్ ఫార్మాట్ ఇంటర్నేషనల్ రన్స్ లో రెండోస్థానానికి చేరుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20 లు కలిపి 28వేల 16పరుగులు చేసిన సంగక్కర ఇన్నాళ్లూ సచిన్ తర్వాత రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు కోహ్లీ 28వేల 17పరుగులతో సెకండ్ ప్లేస్ ను కైవసం చేసుకున్నాడు. మొదటి స్థానంలో ఉన్న సచిన్ 34వేల పరుగులతో అంటే కోహ్లీ కంటే 6వేల పరుగులు ఆధిక్యంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఆల్ టైం గ్రేట్ అనిపించుకోకపోయినా వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం తన ఆధిపత్యాన్ని ఇప్పటికీ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. వన్డేల్లో 53 సెంచరీలు బాది ఇప్పటికే సచిన్ కంటే ఎత్తున నిలిచిన కోహ్లీ 14వేల 650పరుగులతో సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. మరో మూడు వేల పరుగులు కనుక విరాట్ సాధిస్తే వన్డేల్లో ఆల్ టైం గ్రేట్ బ్యాటర్ గా కోహ్లీనే నిలిచే అవకాశం ఉంది.





















