AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Polavaram Project | అమరావతి సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

Andhra pradesh News | అమరావతి: భారతదేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కనుక రాష్ట్రానికి ఇక తిరుగుండదని, పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెట్టి, సుపరిపాలన అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి సానుకూల ఫలితాలను ఇచ్చిందని, ప్రజల్లో మళ్ళీ ఆశలు, విశ్వాసాన్ని నింపగలిగామని సంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని దుస్థితి నుంచి, సూపర్ సిక్స్ వంటి భారీ హామీల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా పట్టాలెక్కించామని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేసి ప్రజల ఆశలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
సంక్షేమ పథకాల ఘన విజయాలు
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ధిదారులకు అందిన సహాయాన్ని సీఎం గణాంకాలతో వివరించారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,090 కోట్లు జమ చేయగా, 'స్త్రీశక్తి' ఉచిత ప్రయాణం కింద మహిళలు 3.5 కోట్ల సార్లు ప్రయాణించారు (రూ.1,114 కోట్ల వ్యయం). అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు, 'దీపం 2.0' కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే ఏడాదిన్నర కాలంలో రూ.50 వేల కోట్ల సామాజిక పెన్షన్లను అందించి సంక్షేమంలో సరికొత్త మైలురాయిని అధిగమించినట్లు వెల్లడించారు.
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని, దీనిని వచ్చే పుష్కరాల లోపు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న 3 వేల టీఎంసీల గోదావరి నీటిని పోలవరం-నల్లమల సాగర్ లింక్ ద్వారా రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు తరలించి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని, తెలంగాణ కూడా మిగిలిన నీటిని వాడుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వివాదాలు లేకుండా గోదావరి మిగులు జలాలను వినియోగించుకోవడంపై ఫోకస్ చేశామన్నారు. ఇటీవల ట్రయల్ రన్ విజయవంతమైన భోగాపురం ఎయిర్‌పోర్టును కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
పెట్టుబడులు, ఐటీ రంగం
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులలో 25 శాతం ఏపీకే రావడం విశేషమని చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ (AI) డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని, అమరావతిలో 'క్వాంటం వ్యాలీ'కి త్వరలో పునాది వేస్తామని వెల్లడించారు. విశాఖ ఉక్కును రూ.12 వేల కోట్ల కేంద్ర సాయంతో కాపాడుకుంటామని, సీఐఐ, ఎస్ఐపీబీ (SIPB) ఒప్పందాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్ కు రూ.1.19 కు తగ్గించడమే భవిష్యత్ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పెంచలేదన్నారు.






















