Konijeti Rosaiah Wife Passes Away: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి కన్నుమూత
Konijeti Sivalakshmi, Passes Away at 86 | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి (86) కన్నుమూశారు.

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్ అమీర్‌పేటలోని తన నివాసంలో మరణించారు. 2021లో రోశయ్య మృతిచెందిన తరువాత ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి అమీర్‌పేటలోనే నివసిస్తున్నారు.
శివలక్ష్మి నిరాడంబరతకు నిలువుటద్దంగా ఉండేవారు. రోశయ్య రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అనంతరం తమిళనాడు గవర్నర్‌గా అత్యున్నత పదవులు చేపట్టినా. ఆమె ఎప్పుడూ తెరవెనుకే ఉండేవారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. భర్త రోశయ్య విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందారు. ఆమె మృతి పట్ల కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.























