Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
IAS Transfers: ఏపీ ప్రభుత్వం పలు చోట్ల డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసిది. మొతతం ఇలా పధ్నాలుగు మంది ఆఫీసర్లను బదిలీ చేశారు.

AP IAS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా సౌలభ్యం మరియు వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కీలక పోస్టులను భర్తీ చేసే ఉద్దేశంతో ఈ బదిలీలు చేపట్టింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, పలువురు యువ అధికారులకు జాయింట్ కలెక్టర్లుగా , మున్సిపల్ కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న పి. శ్రీనివాసులు ను బదిలీ చేసి మార్కాపురం జాయింట్ కలెక్టర్గా నియమించగా, అక్కడ జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు.
ముఖ్యమైన శాఖల బాధ్యతల్లో కూడా మార్పులు జరిగాయి. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్ నియమితులయ్యారు. అలాగే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్. శోబిక కు బాధ్యతలు అప్పగించారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్ నియమితులవ్వగా, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా కల్పన కుమారి బాధ్యతలు చేపట్టనున్నారు. వివిధ జిల్లాల్లో పాలనా వేగాన్ని పెంచేందుకు ఈ మార్పులు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించారు. విశాఖపట్నం జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి , అన్నమయ్య జిల్లాకు శివ్ నారాయణ్ శర్మ , పల్నాడుకు వి. సంజనా సింహ అనకాపల్లికి మల్లవరపు సూర్యతేజ , చిత్తూరు జిల్లాకు ఆదర్శ్ రాజేంద్రన్ లను జేసీలుగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ అధికారులంతా తక్షణమే తమ కొత్త బాధ్యతలను స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ బదిలీలలో ఒక ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన నిధి మీనా , ప్రస్తుతం అదే జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం విశేషం. భార్యాభర్తలిద్దరూ ఒకే జిల్లాలో అత్యున్నత అధికార హోదాల్లో పనిచేయడం పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.





















