Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
ED in AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో పెద్ద ఎత్తున ఆస్తులు జప్తు చేసిన ఈడీ కీలక నిందితుల్ని వరుసగా ప్రశ్నిస్తున్నారు. మాజీ సీఎం జగన్ సన్నిహితుల ఆస్తుల వివరాలు తీసుకుని ప్రశ్నిస్తోంది.

ED questions Jagan close associates in AP liquor scam: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు రూ. 4,000 కోట్ల మద్యం కుంభకోణం లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని నిశితంగా విచారిస్తున్న ఈడీ, తాజాగా కీలక నిందితులైన ధనుంజయ్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. తమ గత పదేళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పాన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లతో హాజరుకావాలని అధికారుల ఆదేశించడంతో నిందితులు విచారణకు హాజరయ్యారు.
ఈ కేసులో ఈడీ ఇప్పటికే భారీ చర్యలకు ఉపక్రమించింది. మార్చి 6న ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, బూనేటి చాణక్య, ఐఆర్ఎస్ అధికారి వాసుదేవరెడ్డికి చెందిన రూ. 441.63 కోట్ల విలువైన చరాస్తులు, స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, విలువైన భూములు ఉన్నాయి. దర్యాప్తులో ఇప్పటివరకు దాదాపు రూ. 1,048 కోట్ల మేర ముడుపులు చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. డిస్టిలరీల నుంచి నగదు, బంగారం రూపంలో ఈ అక్రమ సంపాదన జరిగినట్లు ఆధారాలు సేకరించారు.
దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైలులో ఉన్న ఏ1 నిందితుడు రాజ్ కేసిరెడ్డిని కోర్టు అనుమతితో విచారించి కీలక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే ప్రస్తుతం ఇతర అధికారులకు, రాజకీయ అనుచరులకు నోటీసులు వెళ్తున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌లను విచారించిన అధికారులు.. మద్యం కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడంలో జరిగిన అవకతవకలు, సిండికేట్ల ద్వారా జరిగిన నగదు బదిలీపై లోతైన వివరాలు రాబట్టారు.
ఈ కుంభకోణం వెనుక ఒక పక్కా పథకం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. 2019 తర్వాత ఆన్‌లైన్ మద్యం విక్రయాల వ్యవస్థను కావాలనే నిలిపివేసి, మాన్యువల్ నగదు విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఏటా వందల కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగినట్లు సిట్, ఈడీ గుర్తించాయి. కొన్ని ప్రత్యేక బ్రాండ్లను మాత్రమే ప్రోత్సహించడం కోసం డిస్టిలరీల నుంచి 15-20 శాతం కమిషన్లు వసూలు చేశారని, ఈ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాల్లోకి మళ్లించారని ఈడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో 50 మందికి పైగా నిందితులు ఉండగా, ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేశారు. తాజా విచారణలో నిందితులు సమర్పించే ఆస్తుల వివరాలు మరియు బ్యాంక్ లావాదేవీల ఆధారంగా మరికొంతమంది కీలక వ్యక్తులపై ఈడీ కొరడా ఝులిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న ఈ మొత్తం వ్యవహారంలో.. అసలు సూత్రధారులు ఎవరనే దానిపై ఈడీ తన నివేదికను సిద్ధం చేస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























