(Source: Poll of Polls)
NTR Pic On Hundred Coin : వంద రూపాయల నాణంపై ఎన్టీఆర్ బొమ్మ, త్వరలో ప్రజల్లోకి - పురందేశ్వరి
NTR Pic On Hundred Coin : వంద రూపాయల నాణంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించేందుకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేశారని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. త్వరలో నాణెం ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
NTR Pic On Hundred Coin : ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెంపై ముద్రించేందుకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న వంద రూపాయల నాణెం ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆమె కోరారు. తిరుపతి అంటే ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమని.. ఆయన రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ప్రారంభించారని పురందరేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మరో పది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరు శత జయంతి వేడుకలకు రావాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుపతిలో జరిగిన శత జయంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఎన్టీఆర్ ఓ సమగ్ర సమతా మూర్తి
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై ఎన్టీఆర్ మనిషి అని ముద్ర వేశారన్నారు. దానికి తాను ఎంతో గర్విస్తున్నానని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమానికి గురువారం హాజరైన సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ఈ కామెంట్స్ చేశారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాక ఎన్టీఆర్‌పై పుస్తకం రాస్తానని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. తిరుపతితో ఎన్టీఆర్‌కు ఎంతో అనుబంధం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనన్న ఆయన... ఎన్టీఆర్ ఓ సమగ్ర సమతా మూర్తి అని వ్యాఖ్యానించారు. రైతు బిడ్డగా, రంగస్థల నటుడిగా, కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
ఎన్టీఆర్ అభిమానిని
కాలేజీలో చదివే రోజుల్లోనే నేను ఆయన అభిమానిని. 1983లో ఆయన కోసం పరోక్షంగా పనిచేశాను. సంక్షోభ సమయంలో ఆయన తరఫున వాదించడానికి ఎవ్వరూ లేరు. కానీ, ప్రజాభిమానంతో ఆయన తిరిగి పదవి దక్కించుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన వెంట ఎవ్వరూ రాలేదు. అది నేను దగ్గరగా చూశాను. అప్పట్లో ఢిల్లీకి ఆయన నన్ను తీసుకెళ్లేవారు. ఆయనకు మందులు అందించేవాడిని. రిటైర్ అయ్యాక ఎన్టీఆర్ గురించి పుస్తకం రాస్తాను అని ఎన్వీ రమణ ప్రకటించారు. తెలుగుజాతి ఐక్యంగా ఉండాల్సింది. ఈ విషయంలో తమిళనాడు ఆదర్శం. ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా అందరూ కృషి చేయాలి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఊరూవాడా జరగాలి అని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.