Nellore News: స్కూల్‌కి బయల్దేరిన బాలిక, కట్ చేస్తే అడవిలో చెట్టుకు కట్టేసిన స్థితిలో - అసలేం జరిగిందంటే
బాలికను గొర్రెల కాపరులు రక్షించారు. సకాలంలో గొర్రెల కాపరులు అటుగా రాకపోతే పరిస్థితి ఏంటనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
![Nellore News: స్కూల్‌కి బయల్దేరిన బాలిక, కట్ చేస్తే అడవిలో చెట్టుకు కట్టేసిన స్థితిలో - అసలేం జరిగిందంటే Nellore News: udayagiri minor girl kidnaps and ties in forest towards bandaganipalli DNN Nellore News: స్కూల్‌కి బయల్దేరిన బాలిక, కట్ చేస్తే అడవిలో చెట్టుకు కట్టేసిన స్థితిలో - అసలేం జరిగిందంటే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/13/96b7026437d1c2f36e8bad56cda592a51663035811639234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బాలిక కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ బాలికను గొర్రెల కాపరులు రక్షించారు. సకాలంలో గొర్రెల కాపరులు అటుగా రాకపోతే పరిస్థితి ఏంటనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపర్ల బారినుంచి బయటపడిన బాలిక.. వివరాలను పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఉదయగిరి పట్టణంలోని దిలావర్ భాయి వీధికి చెందిన రషీద్, నస్రీన్ దంపతులు. వీరికి సమ్రీన్, మసీరా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిద్దరూ స్థానిక నాగులబావి వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. పెద్ద కుమార్తె సమ్రీన్ ఏడో తరగతి చదువుతుండగా, చిన్న కుమార్తె మసీరా ఐదో తరగతి చదువుతోంది. ప్రతిరోజూ ఉదయాన్నే స్కూల్ కి వెళ్లడం, మధ్యాహ్నం భోజనం సమయంలో ఇంటికొచ్చి ఆ తర్వాత తిరిగి స్కూల్ కి వెళ్తుంటారు అక్క చెల్లెళ్లు.
సోమవారం మధ్యాహ్నం కూడా ఇద్దరూ కలసి స్కూల్ కి వెళ్లారు. తిరిగి భోజనం కోసం ఇంటికి వచ్చారు. ఇంటినుంచి తిరిగి వెళ్లే సమయంలో పెద్దమ్మాయి సమ్రీన్ ముందు స్కూల్ కి వెళ్లింది. ఆ తర్వాత మసీరా ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరింది. ఈ గ్యాప్ లో ఇద్దరు దుండగులు తన వద్దకు వచ్చి బైక్ పై బలవంతంగా తీసుకెళ్లారని చెబుతోంది మసీరా. మాస్క్ లు ధరించిన ఇద్దరు వ్యక్తులు తన వద్దకు వచ్చారని, తనని కూడా బైక్ పై ఎక్కించుకుని వెళ్లారని అంటోంది.
అడవిలో బాలిక..
సమ్రీన్ స్కూల్ కి వెళ్లి తిరిగొచ్చింది. తనతోపాటు చెల్లిని ఎందుకు పంపించలేదని తల్లిదండ్రుల్ని అడిగింది. దీంతో తల్లిదండ్రులు భయపడ్డారు. కాస్త ఆలస్యంగా స్కూల్ కి బయలుదేరిన మసీరా ఎక్కడికెళ్లిందోనని కంగారు పడ్డారు. ఆమెకోసం వెదకడం ప్రారంభించారు. ఈలోగా ఉదయగిరిలోని గొర్రెల కాపరులు అడవిలోనుంచి మసీరాని తీసుకొచ్చారు. అడవిలో ఆమెను చెట్టుకు కట్టేసి ఉంచారని చెప్పారు. ఉదయగిరి నుంచి బండగానిపల్లి వైపు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పొదల్లో ఓ చెట్టుకు బాలికను కట్టేసి ఉంచారని చెప్పారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎవరా కిడ్నాపర్లు..?
పోలీసులు ఈ కేసుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మసీరాని కిడ్నాప్ చేసినవారి ఆనవాళ్లకోసం సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అసలు కిడ్నాపర్లు బాలికను అడవిలోకి ఎందుకు తీసుకెళ్లారు. చెట్టుకు కట్టేసిన వారు అక్కడ ఎందుకు లేరు, గొర్రెల కాపరులకు కూడా కిడ్నాపర్లు ఎందుకు కనిపించలేదు అనే విషయాలను ఆరా తీస్తున్నారు. మసీరా మాత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్ లు ధరించి ఉన్నారని, తనని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారని అంటోంది.
వరుస ఘటనలతో ఆందళన..
ఇటీవల నెల్లూరు నగరానికి సమీపంలో ఏడో తరగతి చదువుతున్న బాలికపై మేనమామ యాసిడ్ దాడి చేయడం సంచలనంగా మారింది. ఆడ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నెల్లూరు ఘటనలో రోజుల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఉదయగిరిలో స్కూల్ బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)