Viral News: బాయ్‌ఫ్రెండ్ అలా చేశాడని డయల్ 100కు కాల్ చేసిన యువతి, సీరియస్‌గా తీసుకున్న పోలీసులు!

Anantapur woman calls Dial 100 to seek police help | అనంతపురం: సాధారంగా సార్ నన్ను వేధిస్తున్నారు కాపాడండి, నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసి ముఖం చాటేశాడనో.. నన్ను ప్రేమించి, వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని న్యాయం చేయాలంటూ కొందరు యువతులు పోలీసులను ఆశ్రయించడం చూశాం. తన వద్ద నగదు, బంగారం కాజేసి లవర్ మాయం అయిపోయాడన్న కేసులు మనకు తెలుసు. కానీ 'సార్.. బాయ్ ఫ్రెడ్ నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. సాయం చేయండి సార్’ అని ఓ యువతి పోలీసుల సాయం కోరడం హాట్ టాపిక్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
డయల్ 100కు ఫోన్ చేస్తే వెంటనే తమ సమస్య తీరుతుందని, ఆపదలో ఉన్న తమను పోలీసులు రక్షిస్తారని ప్రజల నమ్మకం. కానీ ఓ యువతి డయల్ 100కు ఫోన్ చేసి అడిగిన సాయానికి అనంతపురం పోలీసులు షాకయ్యారు. ‘సార్.. నా బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు. మీరు అతడికి ఫోన్ చేసి మాట్లాడండి. ఎలాడైనా నా నెంబర్ అన్ బ్లాక్ కూడా చేపించండి’ సార్ అని గుత్తి ఆర్ఎస్‌కు ఓ యువతి డయల్ 100కు ఫోన్ చేసి ఈ సాయం చేయాలని కోరింది.
ఆమె సెన్సిటివ్ అనుకున్నారో, లేక తాము సాయం చేయకపోతే యువతి ఏమైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటుందని భావించారో కానీ పోలీసులు ఆమె రిక్వెస్ట్ ను సీరియస్‌గా తీసుకున్నారు. అసలే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కావడంతో డయల్ 100 ద్వారా గురువారం (ఫిబ్రవరి 13న) వచ్చిన ఈ ఫిర్యాదును కంట్రోల్ రూం నుంచి లోకల్ పీఎస్‌కు పంపించారు. గుత్తి పోలీస్ స్టేషన్ నుంచి బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ సుధాకర్ ఆ యువతిని సంప్రదించారు. కానీ ఆ యువతి మాత్రం పోలీసులు తన ఇంటి వద్దకు మాతరం రావద్దని, బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడి.. తన ఫోన్ నెంబర్ అన్ బ్లాక్ (Number UnBlock) చేపిస్తే చాలని రిక్వెస్ట్ చేసింది. కానిస్టేబుల్ యువతి బాయ్ ఫ్రెండ్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు. కానీ యువకుడు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో, దీనిపై పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడం మంచిదని ఆ కానిస్టేబుల్ యువతికి సూచించారు. అయితే డయల్ 100ను ఇలా కూడా వాడేస్తున్నారా అని విషయం తెలిసిన వాళ్లు షాకవుతున్నారు. వాడకం అంటే ఇదేనని లవర్స్ కామెంట్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

