CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Andhra Pradesh News | రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన రైతులు బ్యాంకులకు వస్తే వారికి కేవలం 15 నిమిషాల్లో రుణాలు మంజురు చేయాలని బ్యాంకర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

AP CM Chandrababu Hold SLBC meeting | అమరావతి: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాతలకు 15 నిమిషాల్లోనే లోన్ ఇచ్చేలా చూడాలని బ్యాంకర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందన్నారు. విచారణలో భాగంగా బ్యాంకుల నుంచి సైతం సమాచారం అవసరం ఉంటుందని, దర్యాప్తు సంస్థలకు అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతుల అంశానికి సంబంధించి బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు. అర్హులైన రైతులు బ్యాంకుకు వస్తే వారికి కేవలం 15 నిమిషాల్లోనే లోన్ ఇచ్చే విధానం తీసుకురావాలని చంద్రబాబు నిర్దేశించారు. పీఎం సూర్యఘర్ పథకం (PM Surya Ghar Scheme) కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్తు అందించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ పరికరాలు 2 కిలోవాట్ల వరకు అందిస్తామన్న చంద్రబాబు.. తద్వారా ఉచిత విద్యుత్తు ఉత్పత్తితో పాటు.. మిగులు విద్యుత్తు ద్వారా వారు కొంతమేర అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఏపీలోనూ పంటల సాగులో మార్పులు వస్తున్నాయి. ఉద్యాన పంటలు, ఇతర లాభదాయక పంటల వైపు అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం, డెయిరీ, ఆక్వా రంగాలను మరింతగా ప్రోత్సహించాలి. పెట్టుబడి విషయమై బ్యాంకులకు వచ్చే అర్హులైన రైతులకు బ్యాంకులు సహకారం అందించి వారిని ప్రోత్సహించాలని సూచించారు.
ఇప్పటివరకూ రూ. 5.34 లక్షల కోట్ల రుణాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో పలు రంగాలకు చెందిన వారికి ఏకంగా రూ.5.34 లక్షల కోట్ల వరకు రుణాలిచ్చాం. తమ టార్గెట్‌లో 99 శాతం సాధించినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో యూనియన్ బ్యాంక్ సీఈఓ, ఎండీ మణిమేఖలై తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి రూ.2.64 లక్షల కోట్ల లోన్ టార్గెట్ కాగా, రూ.2.37 లక్షల కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగంలో రూ.3.37 లక్షల కోట్లకుగానూ ఇదివరకే రూ.3.26 లక్షల కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఎంఎస్‌ఎంఈ (MSME) రంగానికి రూ.79,905 కోట్ల రుణాలతో పాటు ప్రాధాన్యేతర రంగానికి సైతం రూ.2.08 లక్షల కోట్ల లోన్ ఇచ్చినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp governance) కోట్లాది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.
పీఎంఈజీపీ కింద వారికి రుణాలు
గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, కౌలు రైతులకు సైతం రుణాలు మంజూరులో మార్పు కనిపిస్తుందన్నారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. అయితే వారికి వ్యవసాయంలో టెక్నాలజీ చేర్చడంలో భాగంగా డ్రోన్ల కొనుగోలుకు సైతం రుణాలివ్వాలని బ్యాంకర్లను ఆయన కోరారు. ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. పీఎంఈజీపీ (PMEGP) కింద స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇవ్వాలని ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బ్యాంకర్లను కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

