Karimnagar News: స్మార్ట్ సిటీని వీడని చెత్త సమస్య, ఏం చేయనున్నారు?
Karimnagar News: స్మార్ట్ సిటీగా పలు ప్రతిష్టాత్మక అవార్డులు తీసుకుంటున్న కరీంనగర్ పట్టణాన్ని చెత్త సమస్య వీడడం లేదు. డంపింగ్ యార్డ్ వద్ద పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి తెగ ఇబ్బంది పెడుతోంది.
Karimnagar News: దేశంలోనే స్మార్ట్ సిటీగా ఎంపికై ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్న కరీంనగర్ ని చెత్త సమస్య ఇబ్బంది పెడుతోంది. పెరిగిన పట్టణీకరణ వల్ల లోయర్ మానేరు డ్యాం సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వద్ద పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్త... చిన్నపాటి కొండలాగ మారింది. దీంతో దాన్ని తొలగించడానికి కోట్ల రూపాయలతో టెండర్ వేసి మరీ కంపెనీలను ఆహ్వానించారు. బయో మైనింగ్ కోసం కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీ అనుకున్న స్థాయిలో పనిచేసే పరిస్థితి లేకపోవడంతో చెత్తను తొలగించడం నెమ్మదిగా సాగుతోంది. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఇంటింటా సేకరిస్తున్న చెత్తను నిల్వ చేయాలంటే స్థలం సమస్యగా మారుతోంది. బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డులో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడంతో ప్రతి రోజు టన్నుల కొద్దీ వచ్చే చెత్తను ఎక్కడ నిల్వ చేయాలి అనేది సవాలుగా మారింది.
బయోమైనింగ్ ఏర్పాటు చేసిన తీరని సమస్య..
60 డివిజన్ల నుంచి నిత్యం 150 మెట్రిక్ టన్నుల చెత్తను ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోలు, వ్యాన్ ల ద్వారా తీసుకొచ్చి వేస్తున్నారు. చెత్త వల్ల దుర్వాసన వస్తుందని ఆ ప్రాంతవాసులు అంటున్నారు. దుకాణాల ముందు వాహనాలు నిలిపి వేసి ఉండడంతో పనులు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నగర వీధుల్లో తీసుకొస్తున్న చెత్తను డంపింగ్ యార్డులో పడేస్తుండగా అందులోని చెత్తను ప్రొక్లెయిన్ తో పేర్చుతున్నారు. ఒకేసారి నగరం గుండా వస్తున్న వాహనాలు లోపలికి వెళ్లాల్సి ఉండగా స్థలం లేకపోవడంతో ముందుగా వచ్చిన ఆటోల్లోంచి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళుతున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. డంపింగ్ యార్డులో తొమ్మిది నెలల వ్యవధిలో ఖాళీ చేసేలా స్మార్ట్ సిటీ నిధులతో బయోమైనింగ్ ప్రారంభించారు. గత నాలుగు నెలలుగా చెత్త శుద్ధి చేస్తుండగా పనుల్లో వేగం కనిపించడం లేదు. వర్షం పడితే తరచుగా నిలిపి వేస్తుండడం, సాంకేతిక సమస్యల కారణంగా చూపించడంతో రోజుకు ఒక ట్రక్కు లోడు చెత్త కూడా అక్కడ ఖాళీ కావడం లేదు. దీనికి తోడు నగరం నుంచి వస్తున్న టన్నుల చెత్తను నిల్వ చేసేందుకు దొరకడం లేదు.
రోజుకు ఐదారు ట్రక్కుల చెత్తను ప్రాసెసింగ్ చేస్తే తప్ప తీరని సమస్య..
ప్రతి రోజు చేస్తే ఐదారు ట్రక్కుల మేర చెత్తను ప్రాసెసింగ్ చేస్తే తప్ప సమస్య పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. ఇలా అయితే మరో ఏడాది అయినా డంపింగ్ యార్డు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చెత్తను నింపుకునే డంపింగ్ యార్డుకు వెళితే చాలు ట్రాక్టర్లు, వ్యాన్లు బయటకు రావడానికి చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. వచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి. అన్ లోడింగ్ చేసుకొని డివిజన్ కు వెళ్లాలంటే సుమారు రెండు గంటల సమయం పడుతుందని కార్మికులు చెబుతున్నారు. వర్షం పడితే చాలు బురదతో పాటు చెత్త కారణంగా వాహనాలు ముందుకు కదలకుండా మొరాయిస్తున్నాయి. బుధవారం ఇలాగే చెత్తతో వెళ్లిన డంపర్ ప్లేసర్ వ్యాను ఒక్కసారిగా బోల్తా పడింది. చిన్న చిన్న గాయాలతో బయట పడినట్లు సమాచారం. డంపింగ్ యార్డులో నెలకొన్న సమస్యను గుర్తించిన జవాన్లు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.