New Osmania Hospital: ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన- విస్తీర్ణం, బడ్జెట్, ప్రత్యేకతలు ఇలా
Revanth Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్ నిర్మిస్తున్నారు.

Goshamahal stadium Hyderabad | హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ నిర్మాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియం వద్ద కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ భవనానికి శుక్రవారం మధ్యాహ్నం భూమిపూజ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఉదయం 11.55 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సైతం కార్యక్రమానికి హాజరయ్యారు.
100 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా ఉస్మానియా కొత్త బిల్డింగ్
దశాబ్దాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఇతర రాష్ట్రాల ప్రజలకు ఉస్మానియా ఆసుపత్రి సేవలందించింది. అయితే పేషెంట్ల రద్దీ, మెరుగైన వసతుల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అఫ్జల్‌గంజ్‌లో ప్రస్తుతం హాస్పిటల్ ఉండగా.. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కనీసం 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా నిర్మాణం జరగాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
2000 పడకల సామర్థంతో కొత్త భవనం
32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 వేల పడకల సామర్థ్యంతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూ.2500 కోట్ల నుంచి రూ.2700 కోట్ల వరకు అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా నూతన బిల్డింగ్ పనులకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ప్రతిరోజూ దాదాపు 5 వేల మంది పేషెంట్లకు సేవలు అందించేలా ఐసీయూ వార్డులు, అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు, డయాగ్నొస్టిక్ సేవలు నూతన భవనంలో అందుబాటులోకి రానున్నాయి. రోబోటిక్ సర్జరీలు సైతం జరిగేలా మెరుగైన సేవలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

