Balapur Laddu Auction: వేలంపాటలో బాలాపూర్ గణేశుడి లడ్డుకు భలే డిమాండ్.. 1994లో రూ.450తో మెుదలై.. ఇప్పుడు ఎంతో తెలుసా?
వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు. 2019 కంటే ఈ ఏడాది భారీ ధర పలికింది.
బాలాపూర్ లడ్డూను 18.90 లక్షలకు మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్ దక్కించుకున్నారు. ఏపీ ఎమ్మెల్సీ.. రమేశ్ యాదవ్ ఈ వేలం పాటలో పాల్గొన్నారు. మర్రి శశాంక్ రెడ్డితో కలిసి లడ్డును దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు లడ్డూను కానుకగా ఇవ్వడానికే వేలంలో పాల్గొన్నట్టు చెప్పారు.
1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట జరుగుతుంది. మెుదటిసారి కొలను మోహన్ రెడ్డి కుటంబం 450 రూపాయలకు వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు. 1995లో కూడా కొలనుమోహాన్ రెడ్డి కుటుంబం రూ.4500లకు లడ్డును దక్కించుకొంది. 1996లో కొలను కృష్ణారెడ్డి రూ.18 వేలకు దక్కించుకొన్నారు. 1997లో కొలను కృష్ణారెడ్డి రూ.28వేలకు దక్కించుకొన్నారు. 1998లో కొలను మోహన్ రెడ్డి రూ. 51వేలకు., 1998లో కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ.65వేలకు లడ్డును దక్కించుకొన్నారు.
1999లో కళ్లెం అంజిరెడ్డి రూ.66వేలకు, 2000లో జి. రఘునందన్ చారి రూ.85వేలకు, 2001లో కందాడ మాధవరెడ్డి రూ.1.05లక్షలకు, 2002లో చిగురంత తిరుపతిరెడ్డి రూ.1.55లక్షలకు, 2003లో కొలను మోహన్ రెడ్డి రూ.2.01లక్షలకు లడ్డును దక్కించుకున్నారు.
2004లో ఇబ్రహీం శేఖర్ రూ.2.08లక్షలకు, 2005లో చిగురంత తిరుపతి రెడ్డి రూ.3 లక్షలకు, 2006లో జి.రఘునందన్ చారి రూ.4.15లక్షలకు, 2007లో కొలను మోహన్ రెడ్డి రూ. 5.07 లక్షలకు, 2008లో సరిత రూ.5.10లక్షలకు లడ్డును వేలంపాటలో దక్కించుకొన్నారు.
2009లో కొడలి శ్రీధర్ బాబు రూ. 5.35లక్షలకు దక్కించుకోగా.. 2010లో కొలను బ్రదర్స్ రూ. 5.45లక్షలకు లడ్డు సొంతమైంది. 2011లో రూ.పన్నాల గోవర్థన్ రూ. 7.50లక్షలకు దక్కించుకొన్నారు. 2012లో తీగల కృష్ణారెడ్డి రూ.9.26లక్షలకు, 2013లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ. 9.50లక్షలను లడ్డును దక్కించుకొన్నారు.
2014లో కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి రూ. 10.32 లక్షలకు, 2015లో స్కైలాబ్ రెడ్డి రూ. 14.65లక్షలకు, 2016లో నాగం తిరుపతి రెడ్డి రూ.15.60 లక్షలకు దక్కించుకున్నారు. 2017లో తిరుపతిరెడ్డి 15 లక్షల 60 వేలకు లడ్డూను వేలంపాటలో కైవసం చేసుకున్నారు. 2018లో శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. కొలను రాంరెడ్డి 2019లో రూ.17.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్‌కు చెందిన కొలను కుటుంబం వారే..9 సార్లు దక్కించుకున్నారు.
గతేడాది కరోనా వ్యాప్తి వల్ల వేలంపాట జరగలేదు. ఉత్సవసమితి సభ్యులు సీఎం కేసీఆర్‌కు ఆ లడ్డూను అందజేశారు. వేలంపాటలో స్థానికులైతే డబ్బును మరుసటి ఏడాది చెల్లిస్తారు. స్థానికేతరులకు మాత్రం అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధనలు ఉన్నాయి. బాలాపూర్ లడ్డూ వేలంపాటకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.
41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్ గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. గణేశుడి శోభాయాత్ర జరుగుతోంది. ఐదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో ఆఖరిపూజ జరిగింది. ట్యాంక్‌బండ్ వరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ లడ్డును దక్కించుకొన్నవారికి మంచి జరుగుతోందనేది భక్తుల నమ్మకం. ప్రతి ఏటా వేలంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు.