Ganesh Nimajjan 2021: హైదరాబాద్‌లో ఇవాళ ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ షాపులన్నీ బంద్.. సీపీ వెల్లడి
వినాయక విగ్రహ నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో పోలీసులు ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది తొలిసారిగా పీవీ నరసింహారావు మార్గ్ (నెక్లెస్ రోడ్)లో కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని అన్నారు. 27 వేల మంది పోలీసులు బలగాలతో హుస్సేన్ సాగర్ వద్ద సహా ఇతర ప్రాంతాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. 2020లో కరోనా కారణంగా నిమజ్జనాలు జరగలేదని గుర్తు చేశారు. 2.5 లక్షల మట్టి వినాయక విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ద్వారా పంపిణీ చేశారని, దీనివల్ల చాలా మంది ఈ చిన్న విగ్రహాలను తమ ఇళ్లలోనే నిమజ్జనం చేస్తున్నారని వెల్లడించారు.
రాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బలగాలతో నిఘా కట్టుదిట్టం చేశామని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సహా గట్టి నిఘా ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు. అనుభవం ఉన్న, సమర్థం ఉన్న పోలీసు అధికారులను నగరంలో ఇంఛార్జ్‌లుగా నియమించామని వివరించారు. జియో ట్యాగింగ్ ద్వారా విగ్రహాల నిమజ్జనం మొత్తం పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
వినాయక విగ్రహ నిమజ్జనం కోసం హైదరాబాద్‌లో పోలీసులు ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి నుంచే అంతర్రాష్ట్ర, జిల్లాల నుంచి లారీల ప్రవేశాలపై నిషేధం విధిస్తున్నట్టు చెప్పారు. నిమజ్జనం కోసం నగరంలో తిరిగే ఆర్టీసీ బస్సులను చాలా వరకూ తగ్గించారు. ఇంకొన్ని చోట్ల దారి మళ్లిస్తున్నామని అన్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా సదుపాయం ఏర్పాటు చేశామని వివరించారు.
వైన్ షాపులు కూడా బంద్
నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా వైన్ షాపులు కూడా మూసి ఉంచాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు వైన్ షాపుల యజమానులకు ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వైన్ షాపుల దుకాణాలు మూసివేస్తున్నట్టు వెల్లడించారు. వైన్స్, పబ్‌లు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేస్తున్నట్లు వివరించారు. ఆదివారం (సెప్టెంబరు 19) ఉదయం 9 గంటల నుంచి తర్వాతి రోజు సాయంత్రం 6 గంటల వరకు ఆయా షాపులు మూసివేసి ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.