CM KCR: తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీక: సీఎం కేసీఆర్
CM KCR: ఇవాళ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయను స్మరించుకున్నారు. నిత్యం పరుల క్షేమం కోసమే పరితపించారని పేర్కొన్నారు.
CM KCR: తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు సామాజిక ఉద్యమ కారుడిగా, స్వాతంత్ర్య సమర యోధుడిగా చేసుకున్న సేవలను... సెప్టెంబర్ 9న ఆయన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. పద్మవిభూషణ్, ప్రజా కవి కాళోజీ నారాయణ రావు నిత్యం పరుల క్షేమం కోసమే పరితపించారని పేర్కొన్నారు.
ఆయన శ్రమను గౌరవిస్తూనే..
తెలంగాణ సాహిత్యానికి, భాషకు కాళోజీ చేసిన కృషి అమోఘమని కేసీఆర్ అన్నారు. ఆయన పడిన శ్రమను గౌరవిస్తూనే.. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా.. తెలంగాణ భాషా, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేస్తున్న తెలంగాణ సాహితీ వేత్తలు, కవులు, వైతాళికులను గుర్తించి.. కాళోజీ నారాయణ రావు పేరు మీద తెలంగాణ సర్కారు విశిష్ట పురస్కారాలను అందిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ఏడాదికిగానూ కాళోజీ పురస్కారానికి ఎంపికైన కవి, చరిత్ర కారుడు శ్రీరామోజు హర గోపాల్ కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందనలు తెలియజేశారు.
హైదరాబాద్ రాష్ట్రం స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుండి నడిపారు..
1914లో కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ లోని రట్టిహళ్లిలో జన్మించారు కాళోజీ నారాయణ రావు. అయితే ఆయన అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. కానీ అందరూ ఆయనను కాళోజీ అని, కాళన్నా అని పిలుచుకునే వారు. కర్ణాటకలో పుట్టినప్పటికీ ఆయనకు ఆ రాష్ట్రంలో పెద్దగా సంబంధం లేదనే చెప్పాలి. ఆయన చిన్నప్పుడే వారి కుటుంబం వరంగల్ కు వచ్చి స్థిరపడింది. వరంగల్ లోనే కాళోజీ బాల్యం గడిచింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను వరంగల్ లోని మడికొండలో, హైదరాబాద్ లో పూర్తి చేశారు కాళోజీ. విద్యార్థి దశ నుండే ఉద్యమాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆర్య సమాజ్, పౌర హక్కుల సాధన వంటి పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. తర్వాత ఆంధ్ర మహా సభ ప్రారంభం అయినప్పటి నుండి దాని కార్యకలాపాల్లో చాలా చురుకుగా పని చేసే వారు. సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కాళోజీ. హైదరాబాద్ రాష్ట్రం స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుండి నడిపారు. పలు సార్లు జైలుకు వెళ్లి వచ్చారు. తుర్కుండే కమిటీలో సభ్యుడిగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి కాళోజీ మూడు సార్లు పోటీ చేసి.. ఒకసారి విజయం సాధించారు.
అనేక భాషలపై కాళోజికి పట్టు ఉంది..!
తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో కాళోజీకి మంచి ప్రావీణ్యం ఉంది. ఆయా భాషల్లో అనేక రచనలు చేశారు. తన భాష, యాస చాలా మందిని ఆకట్టుకునేవి. తన కవితలు, పద్యాల్లో తన ఆవేశాన్ని వెల్లగక్కేవారు. ఆయన రాసిన నా గొడవ సంకలనం అప్పట్లో సంచనలంగా మారింది. ఆయన చేసిన సేవలను గుర్తించి.. కాకతీయ వర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చింది. రాష్ట్రంలోని వైద్యవిశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పేరే పెట్టింది. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతోంది రాష్ట్ర సర్కారు.