Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, పెళ్లి పేరుతో మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ ఫిర్యాదు
Harsha Sai Telugu News | ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేసిన హర్ష సాయిపై చర్యలు తీసుకోవాలని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Youtuber Harsha Sai | హైదరాబాద్: నార్సింగి పీఎస్ లో గత కొంతకాలం నుంచి సెలబ్రిటీల కేసులు నమోదవుతున్నాయి. తమను అన్యాయం చేశాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ ఇదివరకే కొందరు సెలబ్రిటీలపై ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి చిక్కుల్లో పడ్డాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆరోపించింది. హర్షసాయి తనను మోసం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. తన లాయర్ తో వచ్చిన బిగ్ బాస్ ఫేమ్ తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెళ్లి పేరుతో హర్ష సాయి, అతడి కుటుంబం తనను మోసం చేశారని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తమ వద్ద దాదాపు రూ.2 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆమె నార్సింగి పోలీసుల వద్ద వాపోయింది. అయితే డబ్బు తీసుకున్నా, పెళ్లి మాట ఎత్తడం లేదని.. తనకు ఏ క్లారిటీ ఇవ్వడం లేదని బాధితురాలు తెలిపింది. హర్ష సాయితో పాటు అతడి తండ్రి మీద చర్యలు తీసుకుని, తనను న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.
View this post on Instagram
బిగ్ బాస్ OTT కంటెస్టెంట్ అయిన బాధితురాలు హర్షసాయి నటిస్తున్న MEGA మూవీని నిర్మిస్తున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో హర్షసాయిని హీరోగా ‘మెగా’ సినిమాకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ పెళ్లి అంటే ముఖం చాటేయడంతో తన లాయర్ తో పాటు నార్సింగి పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది.
కాగా, హర్ష సాయి ఓ ఫేమస్ యూట్యూబర్. పేదవారికి సాయం చేస్తూ అతడు చేసిన వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. అతడి యూట్యూబ్ ఛానల్ కు 10.9 మిలయన్ల ఫాలోయర్లు, ఇన్‌స్టాగ్రామ్ లో అయితే ఏకంగా 14 మిలియన్ల మంది హర్ష సాయిని ఫాలో అవుతున్నారు. మెగా అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు హర్ష సాయి సిద్ధంగా ఉన్నాడని తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఏడాది కిందట టీజర్ విడుదల చేశారు. తరువాత మెగా సినిమా అప్ డేట్స్ రావడం లేదు.