IPL Fastest Ball: ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ డెలివరీ, ఎవరు బాబు నువ్వు?
Mayank Yadav: లఖ్‌నవూ యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ అద్భుతం చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫాస్టెస్ట్ బంతిని విసిరిన బౌలర్‌గా అవతరించాడు.
Who Is Mayank Yadav: కళ్ళు అటు తిప్పి ఇటు తిరిగేలోపే బాల్ పరుగులు తీసింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే గంటకు 156 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. నయా సంచలనం మయాంక్ యాదవ్(Mayank Yadav) . ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో బయటపడిన కొత్త పేసర్. 4 ఓవర్లు వేసిన మయాంక్ కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. ప్రత్యర్ధి బ్యాటర్లను బంబేలెత్తించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(LSG) యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. వేగవంతమైన బంతిని సంధించి ఇప్పటివరకు ఐపీఎల్-2024లోనే ఫాసెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 12వ ఓవర్ తొలి బంతికి 155.8 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు. ఈ సీజన్‌లో నండ్రే బర్గర్ పేరిట ఉన్న రికార్డును ఈ యువ సంచలనం అధిగమించాడు. కీలకమైన జానీ బెయిర్‌స్టోను ఔట్ చేసి ఐపీఎల్‌లో తన తొలి వికెట్ ఖాతా తెరిచాడు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను కూడా ఇబ్బంది పెట్టాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మలను కూడా ఔట్ చేసి లక్నో సూపర్ జెయింట్స్‌ను విజయ తీరాలకు చేర్చాడు. మొత్తంగా తన 4 ఓవర్ల కోటాలో బౌలింగ్ వేసి 27 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు దక్కించుకున్నాడు.
ఎవరీ మయాంక్ యాదవ్?
ఢిల్లీకి చెందిన 21 సంవత్సరాల పేసర్ మయాంక్ యాదవ్. దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు తరపున మూడు ఫార్మాట్లలోనూ అతడు అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పటివరకు ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్, 17 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిసి 27 మ్యాచుల్లో 46 వికెట్లు తీశాడు. నార్త్ జోన్ తరఫున ‘దేవధర్ ట్రోఫీ’లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు తీసి జాయింట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో 2022 ఐపీఎల్ మెగా వేలంలో బేస్ ధర రూ.20 లక్షల మొత్తంతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. కానీ అతడు గాయం కారణంగా ఐపీఎల్-2023 సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. నిన్నటి మ్యాచ్ కి మార్క్ ఉడ్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్ యాదవ్‌కు చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్ 4 ఓవర్లు వేసి, కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు.
దీంతో ఐపీఎల్ ద్వారా కొత్త పేస్ స్టార్ వెలుగులోకి వచ్చాడని అభిమానులు సంబరపడుతున్నారు. త్వరలోనే అతడి నుంచి అత్యంత వేగవంతమైన బంతిని మనం చూసే అవకాశం లేకపోలేదు. మయాంక్ బౌలింగ్‌లో కేవలం పేస్ మాత్రమే కాకుండా.. వైవిధ్యం ఉండటమే అతడి స్పెషాలిటీ. గతంలో ఉమ్రాన్ మాలిక్ కూడా వేగంగా బంతులేసేవాడు. కానీ, అతడి బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్ ఉండేది కాదు. దీంతో భారీగా పరుగులు సమర్పించుకొనేవాడు. కానీ, మయాంక్ బౌలింగ్ మాత్రం బౌలింగ్ చాలా ఖచ్చితంగా ఉంది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ను కూడా తిప్పలు పెట్టాడు.మ్యాచ్ అనంతరం మయాంక్ పేస్‌ను ధావన్ అభినందించకుండా ఉండలేకపోయాడు.