(Source: ECI/ABP News/ABP Majha)
FIFA World Cup 2022: ఫైవ్ స్టార్ హోటల్ బసను తిరస్కరించిన మెస్సీ జట్టు... మరెక్కడుందో తెలుసా!
స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ జట్టు అర్జెంటీనా ఫైవ్ స్టార్ హోటల్ బసను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఫైవ్ స్టార్ హోటల్ ను కాదని ఖతార్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల వసతి గృహాన్ని ఎంచుకుంది.
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ ప్రారంభమైంది. నేటి నుంచే ఖతార్ వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభమవుతోంది. దీనికి సంబంధించిన ప్రతి వార్త అభిమానులకు ఆసక్తికరంగానే ఉంటుంది. అలాంటి వార్త ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది. స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ జట్టు అర్జెంటీనా ఫైవ్ స్టార్ హోటల్ బసను తిరస్కరించినట్లు తెలుస్తోంది. పోటీల్లో పాల్గొనే జట్లు, ఆటగాళ్ల కోసం సకల సదుపాయాలతో కూడిన బసను ఖతార్ ఏర్పాటు చేసింది. అయితే మెస్సీ జట్టు ఫైవ్ స్టార్ హోటల్ ను కాదని ఖతార్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల వసతి గృహాన్ని ఎంచుకుంది.
కప్ ఫేవరెట్లలో ఒకటి
నవంబర్ 22న సౌదీ అరేబియాతో జరిగే మ్యాచుతో లియోనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా తన ప్రపంచకప్ పోటీని ప్రారంభించనుంది. టైటిల్ ఫేవరెట్లలో అర్జెంటీనా జట్టు కూడా ఒకటి. మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ అని వార్తలు వినిపిస్తున్న వేళ ఆ జట్టు కప్ ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. జట్టు కెప్టెన్ గా మెస్సీ 2021లో తొలి కోపా అమెరికా, 2022 లో ఫైనల్ సిమా ట్రోఫీలను గెలుచుకున్నాడు. అయితే ఇప్పటివరకు తన ఖాతాలో ప్రపంచకప్ లేదు. ఇది గెలిచి ఆ లోటును తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. అలాగే ఈ మెగా టోర్నీ గెలిస్తే మెస్సీ ప్రపంచంలోని ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకటిగా నిలిచిపోతాడు. అర్జెంటీనా ఇప్పటివరకు రెండుసార్లు (1978 మరియు 1966) ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. అర్జెంటీనా ఉన్న గ్రూప్ సీలో పోలాండ్, సౌదీ అరేబియా, మెక్సికో లాంటి బలమైన జట్లు ఉన్నాయి.
అసాడోస్ కోసమే
అర్జెంటీనా జట్టు బస చేస్తున్న ఖతార్ యూనివర్శిటీలోని విద్యార్థి వసతి గృహం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసాడోస్ (బార్బెక్యూతో కూడిన కార్యక్రమం) నిర్వహించుకోవడానికి అనువుగా ఉన్నందున అర్జెంటీనా వసతి గృహాన్ని ఎంచుకుందని ఒక అధికారి తెలిపారు. మేము ఈ క్యాంపస్ ను చాలాసార్లు సందర్శించి ఇక్కడ ఉండడానికి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇది ఓపెన్ ఎయిర్ స్పేస్ తో మంచి సౌకర్యాలు కలిగిఉంది. ముఖ్యంగా అసాడోస్ కోసం బహిరంగ స్థలం ఉంది. ఇది అర్జెంటీనా ఆటగాళ్లకు చాలా ముఖ్యం. ఇది మా సంస్కృతిలో భాగం అని ఆ అధికారి తెలిపారు. వారు ఖతార్ లో ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించాలని మేం అనుకున్నాం. ఇది వారిని మరింతగా ఫుట్ బాల్ పై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. అని వివరించారు.
ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్‌ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ఫిఫా ప్రపంచ కప్ 2022 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరుగుతుంది. ఈ మెగా ఫుట్‌బాల్ టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి.
Inside Argentina's rented hotel in Quatar for the world cup🔥🔥 pic.twitter.com/2LDiEfOJCc
— V.I.N.N.Y✊🔥 (@odhusovincent) November 18, 2022