ENG vs NED: ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం, శతకంతో చెలరేగిన బెన్ స్టోక్స్
ODI World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం దక్కింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న బ్రిటీష్ జట్టు పరువు దక్కించుకుంది.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం దక్కింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న బ్రిటీష్ జట్టు.. పసికూన నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించి పరువు దక్కించుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 పరుగులు చేసింది. అనంతరం బ్రిటీష్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 160 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు ఇంగ్లండ్‌కు తొలిసారి పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. జాని బెయిర్ స్టో, డేవిడ్ మలన్ తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. 17 బంతుల్లో 15 పరుగులు చేసిన బెయిర్ స్టోను దత్త్ పెవిలియన్‌కు పంపాడు. కానీ డేవిడ్ మలన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 74 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సులతో 87 పరుగులు చేసి శతకం దిశగా సాగుతున్న మలన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం మళ్లీ ఇంగ్లండ్ వికెట్ల పతనం ప్రారంభమైంది. 35 బంతుల్లో 28 పరుగులు చేసిన రూట్ బౌల్డ్ అవ్వగా.... 16 బంతుల్లో 11 పరుగులు చేసిన బ్రూక్ కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 11 బంతుల్లో అయిదే పరుగులు చేసి అవుటయ్యాడు. 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి పటిష్ట స్థితిలో కనిపించిన బ్రిటీష్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి 178 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొయిన్ అలీ కూడా 15 బంతుల్లో నాలుగు పరుగులు చేసి వెనుదిరగడంతో 192 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది.
ఇక ఇంగ్లండ్ పతనం వేగంగా ముగుస్తుందనుకున్న తరుణంలో గత ప్రపంచకప్ హీరో, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రాణించాడు. బెన్ స్టోక్స్ 84 బంతుల్లో 6 ఫోర్ లు, 6 భారీ సిక్సర్ లతో 108 పరుగులు చేసాడు. స్టోక్స్ చివర్లో విధ్వంసం సరుసటయించడంతో ఇంగ్లాండ్ స్కోర్ 300 పరుగులు దాటింది. అతనికి క్రిస్ వోక్స్ సహకారం అందించాడు. వోక్స్ 45 బంతుల్లో ఐదు 4 లు, ఒక సిక్స్ తో 51 పరుగులు చేశాడు. వీరిద్దరూ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వాండర్ మెర్వ్ 3, ఆర్యన్ దత్త్ 2, వాన్‌బీక్ 2, మీక్‌రన్ 1, డీ లీడే ఒక్క వికెట్ తీశారు.
340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 179 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లు సమష్టిగా రాణించారు. వెస్లీ బరేసీ 39, ఎంగ్రెల్‌బేచ్ 33, ఎడ్వర్డ్స్ 38, తేజ నిడమూరు 41 పరుగులతో పర్వాలేదనిపించిన ఎవరూ భారీ స్కోరు చేయలేదు. డచ్ బ్యాటర్లలో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు. అదిల్ రషీద్ 3, మొయిన్ అలీ 3, డేవిడ్ విల్లీ 2, క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశారు. దీంతో నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. శతకంతో చెలరేగిన బెన్ స్టోక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.