IND vs BAN T20I Series: టీ20 సిరీస్‌లో తిలక్ వర్మకు అవకాశం, శివబ్ దూబే స్థానంలో జట్టు నుంచి పిలుపు
Tilak Varma replaces injured Shivam Dube | బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు ట్వంటీ20ల సిరీస్ లో శివం దూబే వెన్నునొప్పితో దూరంగా కాగా, హైదరాబాదీ తిలక్ వర్మకు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది.
IND vs BAN T20I Series Tilak Varma replaces injured Shivam Dube for T20Is against Bangladesh హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. త్వరలో మూడు టీ20ల సిరీస్ కోసం భారత్, బంగ్లాదేశ్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల టీ20 సిరీస్ జట్టులో చోటు దక్కకున్నా.. అనూహ్యంగా తెలుగు క్రికెటర్ కు జట్టు నుంచి పిలుపొచ్చింది.
హైదరాబాదీ తిలక్ వర్మకు ఛాన్స్
భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే బంగ్లాతో ట్వంటీ20 సిరీస్ కు ఎంపికయ్యాడని తెలిసిందే. అయితే తాను ప్రస్తుతం వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. సిరీస్ ప్రారంభానికి కోలుకునే ఛాన్స్ లేదని బీసీసీఐ ఫిజియోథెరపిస్ట్, మేనేజ్ మెంట్ నిర్ధారించుకుంది. ఆ స్థానంలో మరో బ్యాటర్ ను తీసుకోవాలని తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడి తన ఆటతీరుతో మెప్పించిన తిలక్ వర్మకు టీమిండియాలో అవకాశాలు వస్తున్నాయి. తిలక్ వర్మ గ్వాలియర్ లో టీమిండియాతో ఆదివారం (అక్టోబర్ 6న) కలుస్తాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ తో జరగనున్న 3 టీ20ల సిరీస్ లో డాషింగ్ బ్యాటర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలు భారత ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారని తెలిపాడు. తిలక్ వర్మ ఇదే ఏడాది టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన తిలక్ వర్మ 16 టీ20లు ఆడగా 33.60 సగటుతో 336 రన్స్ సాధించాడు. ఇందులో కొన్ని కీలక ఇన్నింగ్స్ లు సైతం ఉన్నాయి. మరిన్ని అవకాశాలు వస్తే తిలక్ వర్మ భారత జట్టులో రెగ్యూలర్ ప్లేయర్ గా మారేందుకు అవకాశాలు ఉన్నాయి.
Also Read: Women's World Cup 2024: ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్ షాక్, కివీస్ చేతిలో ఘోర ఓటమి
బంగ్లాదేశ్‌తో 3 టీ20ల కోసం భారత్ 15 మంది ఆటగాళ్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ ఈ సిరీస్ ఆడనుంది. వికెట్ కీపర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లను ఎంపిక చేయగా.. వీరిద్దరూ ఓపెనింగ్ చేయనున్నారు. నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) హర్షిత్ రాణా ఎంపికయ్యారు. అయితే ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో జితేష్ శర్మకు అవకాశం రావడం కష్టమే.
అక్టోబర్ 6న ఆదివారం నాడు గ్వాలియర్ వేదికగా రాత్రి 7 గంటలకు భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూఢిల్లీ వేదికగా అక్టోబర్ 9న రెండో టీ20, అక్టోబర్ 12న చివరిదైన మూడో టీ20 హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించారు.