Rath Yatra 2023: పూరీలో వంటకాలను స్వయంగా లక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందట అందుకే అంత రుచి!
సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు కొలువైన క్షేత్రం పూరీ. ఏటా ఆషాఢ శుక్ల విదియనాడు జరిగే రథయాత్రపై ఇక్కడ చాలాప్రత్యేకం. ఈ రథయాత్ర సందర్భంగా పూరీలో వంటగదిపై ప్రత్యేక కథనం
![Rath Yatra 2023: పూరీలో వంటకాలను స్వయంగా లక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందట అందుకే అంత రుచి! jagannath rath yatra 2023 puri rath yatra celebration, Puri Rath Yatra Recipes and prasadam making Rath Yatra 2023: పూరీలో వంటకాలను స్వయంగా లక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందట అందుకే అంత రుచి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/ec9f2af157a87be52cf07020d198cec01687328973834217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rath Yatra 2023: పూరీ జగన్నాథుని రథయాత్ర జూన్ 20 మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. జగన్నాథుడి రథయాత్రను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.
కాశీ కాంచీ అవంతికా
పూరీ ద్వారావతీచైవ
సప్తైతే మోక్షదాయకా!!
దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో పూరీ ఒకటి. సోదరుడు బలభద్రుడితో, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువయ్యాడు. పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీక్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాదిపాటు గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథయాత్ర జరిగే రోజున తన సోదరి సుభధ్ర, సోదరుడు బలభద్రుడితో కలసి రథం అధిరోహిస్తాడు.ఇక్కడ స్వామివారికి నివేదించే వంటకాలను సాక్షాత్తూ ఆ మహాలక్ష్మీదేవి అదృశ్యరూపంలో పర్యవేక్షిస్తుందట. అందుకే అక్కడి ప్రసాదానికి అంత రుచి ఉంటుందని వారి విశ్వాసం.
Also Read: పూరీలో విగ్రహాలను దేవశిల్పి విశ్వకర్మ సగం చెక్కి ఎందుకు వదిలేశాడు!
లక్ష్మీదేవి అదృశ్యంగా పర్యవేక్షిస్తుంది
172సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో ఎకరంలో విస్తరించి ఉంటుంది వంటగది. ఇందులో 32 విశాలమైన వంటగదులుంటాయి. ఒక్కో వంటగది పొడవు 150 అడుగుల, వెడల్పు 100 అడుగులు, ఎత్తు 20 అడుగులు. ఇందులో 500 మంది వంటవాళ్లు, 300 మంది సహాయకులు విధులు నిర్వర్తిస్తుంటారు. 700మట్టి కుండలతో వంటలు వండుతారు. వాటిని 'అట్కా' అని పిలుస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని శ్రీమహావిష్ణువు అర్థాంగి లక్ష్మీదేవి అదృశ్యంగా పర్యవేక్షిస్తుందని విశ్వాసం.
రోజుకి 70 క్వింటాళ్ల బియ్యం
ఆలయానికి ఆగ్నేయ దిశలో ఉండే ఈ వంటగది ప్రపంచంలనే అత్యంత పెద్దది అని చెబుతారు. వంటగది దగ్గరుండే రెండు బావులను 'గంగా', 'యమునా' అని పిలుస్తారు. వాటి నుంచి వచ్చే నీటి నుంచి మాత్రమే భోగ్ (జగన్నాథుడికి సమర్పించే భోగం) తయారవుతుంది. రోజూ కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు. వంటగదిలో ఒకేసారి 50 వేల మందికి మహాప్రసాదం తయారు చేస్తారు. రోజుకి 70 క్వింటాళ్ల బియ్యం వండుతారు. ప్రసాదం తయారు చేయడానికి, 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు. పైభాగంలో ఉంచిన పాత్రలో ఉంచిన ఆహారాన్ని మొదట వండుతారు ఆ తర్వాత కింది నుంచీ ఒకదాని తరువాత ఒకటి వండుతారు. ప్రతి రోజూ కొత్త పాత్రలనే భోగం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వంటలు పూర్తయ్యాక ముందు భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత ప్రసాదం అందిస్తారు.
Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాల్, గర్భగుడి నుంచి జనం మధ్యకు జగన్నాథుడు!
జగన్నాథుడికి రోజుకి 6సార్లు ప్రసాదం
మహాప్రసాదాన్ని జగన్నాథ స్వామి కి రోజుకు ఆరుసార్లు సమర్పిస్తారు. ఉదయం 4, ఉదయం 8, మధ్యాహ్నం 12, సాయంత్రం 4, రాత్రి 7.45, రాత్రి 8.30 ఈ సమయాల్లో స్వామికి నైవేద్యం పెడతారు. ఇందుకోసం 56 రకాల పదార్థాలని తయారుచేస్తారు. హిందీలో 56ని ఛప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని ఛప్పన్ భోగ్గా పేర్కొంటారు. ఈ 56 సంఖ్య వెనుక రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకప్పుడు అఖండ భారతదేశంలో 56 స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో రాజ్యానికి ఒక ప్రసాదం చొప్పున 56 ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు. మరో ఊహ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని ఏడురోజుల పాటు తన చిటికెనవేలు మీద నిలిపి ఉంచాడట. ఆ ఏడురోజుల పాటు ఆయన అన్నపానీయాలనూ ముట్టలేదు. అందుకని ఎనిమిదవ రోజున భక్తుల వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట. ఆనాడు కృష్ణునికి 56 పదార్థాలను అందించారు కాబ్టటి... పూరీ జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతోందని ఓ నమ్మకం.
రథయాత్రకు ప్రత్యేకం
నిత్యం విధుల్లో పాల్గొనేవారికన్నా రథయాత్ర సమయంలో కేవలం లక్షా 14 వేల మంది వంటగది కార్యక్రమంలో నిగమ్నమై ఉంటారు. వివిధ కైంకర్యాలలో దాదాపు 6 వేలమంది పూజారులు పాల్గొంటున్నారు. జగన్నాథుడి సన్నిథిలో పదిరోజుల పాటూ జరిగే ఈ రథయాత్రకి దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. కదులుతున్న రథచక్రాలు చూసి ఆ దేవదేవుడే నడిచివస్తున్నంత తన్మయత్వానికి లోనవుతారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)