Chaturmasya Deeksha: చాతుర్మాస్య దీక్ష చేస్తే పొలిమేర దాటకూడదా - ఈ దీక్ష వెనుకున్న ఆంతర్యం ఏంటి!
Chaturmasya Deeksha: చాతుర్మాస్య దీక్ష చేసేవారు పాటించే నియమాల వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా..ఇంతకీ ఈ దీక్ష చేస్తున్నవారు పొలిమేర దాటకూడదు అని ఎందుకంటారు
Chaturmasya Deeksha: ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఆనాటినుంచి నాలుగు మాసాలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. ప్రస్తుత కాలంలో సన్యాసులు ఈ దీక్షను కొనసాగిస్తున్నారు కానీ గృహస్థులెవరూ ఈ దీక్షచేయడం లేదు. ఈ వ్రతాన్ని పాటించిన నాలుగు నెలల కాలంలో ఒకే పూట భోజనం, బ్రహ్మచర్యం, నేలపైనే నిద్ర అనే నిమమాలతో పాటూ ఊరి పొలిమేరలు దాటకూడదు అనే నియమం కూడా ఉందని చెబుతారు. ఇంతకీ ఎందుకలా చెబుతారు. ఈ దీక్ష వెనుకున్న ఆంతర్యం ఏంటి.
Also Read: చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి - నియమాలేంటి - ఎవరైనా చేయొచ్చా!
ఆషాఢం నుంచి కార్తికం వరకు ప్రకృతిలో పలు మార్పులు
చాతుర్మాస్య దీక్ష పాటించడం అంటే దేవుడిపై భక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దేవుడి పేరుతో మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకునేందుకే ఈ దీక్ష. ఈ చాతుర్మాస్య వ్రతం మానవ జీవనశైలిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడుతుంది. ఆషాఢ మాసం నుంచి కార్తీకమాసం వరకూ ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. వాగులు, వంకలు పొంగుతాయి. రకరకాల మొక్కలు పెరిగి పరిసరాలన్నీ పచ్చగా ఉంటాయన్నది పక్కనపెడితే గుబురుగా తయారవుతాయి. ఎక్కటికక్కడ నీరు నిలవడంతో క్రిమికీటకాలు దరిచేరుతాయి. అంటువ్యాధులు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకే ఈ దీక్ష...
పొలిమేర దాటొద్దని ఎందుకంటారు
చాతుర్మాస్య దీక్ష చేసేవారు పొలిమేర దాటకూడదని చెబుతారు. అంతమాత్రాన దాటితే ఏదో అయిపోతుందని కాదు. అంటు వ్యాధులు విజృంభించే కాలం కావడంతో ఎక్కువగా తిరిగితే అవి ఇంకొంచెం వ్యాప్తి చెందుతాయి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వాటిబారిన పడకతప్పని పరిస్థితులు ఎదురవుతాయి. పూర్వకాలం సన్యాసులు కూడా ఈ నాలుగు నెలలు ఒకేచోట దీక్షగా వ్రతం ఆచరిస్తూ కఠిన నియమాలు పాటించేవారు.
ఋతువులు మారుతున్న సమయంలో వ్యాధులు ప్రబలుతాయి
గ్రీష్మం నుంచి వర్ష ఋతువు ఆపైన శరదృతువు కాలంలో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ఋతువుల సంధ్య కాలాన్ని 'యమద్రంష్టలు' అని అందుకే అన్నారు. శాస్త్రరీత్యా ఆషాఢంలో కామోద్దీపకం ఎక్కువగా ఉంటుంది అందుకే నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. భాద్రపదంలో వర్షాలతో నదులలో నీరు బురదమయంగా ఉంటుంది. ఆ నీరు తాగితే రోగాల బారిన పడతారు. వీటిని నియంత్రించేందుకే నియమిత ఆహార నియమాలు, ఉపవాసాలు నోములు అన్నారు. ఇలా ఈ నాలుగు నెలల్లో ఎన్నో పండుగలు, పర్వాలు పేరిట వివిధ రకాల నియమాలు పెట్టింది అందుకే.
Also Read: తొలి ఏకాదశి(జూన్ 29 ) ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!
ఈ నియమాలన్నీ మనిషిని సన్మార్గంలో నడిపించడానికి దోహదం చేసేవే. మితాహారం ఆరోగ్య కారకం. ఇంద్రియ నిగ్రహం ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేస్తుంది. నాలుగు నెలలు ఈ నియమాలు పాటించడం ద్వారా.. ఆ తర్వాతి కాలంలోనూ మనో నిగ్రహంతో ఉండగలుగుతారనే ఉద్దేశంతోనే చాతుర్మాస్య వ్రతాన్ని సూచించారు మన పెద్దలు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.