Chaturmasya Deeksha: చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి - నియమాలేంటి - ఎవరైనా చేయొచ్చా!
చతుర్మాసాలు అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు. ఆషాఢం, శ్రావణం, బాధ్రపదం, ఆశ్వయుజం ఈ నాలుగు నెలల పాటూ ఆచరించే దీక్షనే చాతుర్మాస్య దీక్ష అంటారు
Chaturmasya Deeksha: తెలుగు నెలలు ఏవైనా కానీ వాటిలో ఏకాదశి తిథులు చాలా ప్రత్యేకం. వాటిలో మొదటిది తొలి ఏకాదశి చివరిది ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో నేలపైనే నిద్రించడం, ఉద్రేకాన్ని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం, నిరంతరం దైవారధనలో గడపడం, రోజూ ఒకే పూట భోజనం చేయటం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం, క్షురకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. చాతుర్మాస్య దీక్ష సమస్త పాపాలు తొలగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సత్యం, ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని హరిశ్చంద్ర మహారాజు మరువలేదని అందుకే చివరికి విజయం చేకూరిందని చెబుతారు.
Also Read: తొలి ఏకాదశి(జూన్ 29 ) ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!
చాతుర్మాస్య దీక్ష గురించి పురాణ గాథ
ఒకసారి కైలాసంలో శివునిచేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి- చేయి మెత్తగా, మృదువుగా ఉండటానికి కారణం అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే ‘ఎముక లేని చెయ్యి’ అని అంటే ఇదే అర్థం. దాన చేసేవారిని అలా అనడం వెనుకున్న ఉద్దేశం ఇదే. పరమేశ్వరుడి మాటవిన్న పార్వతీదేవికి కూడా పరోపకారం చేయాలనే కోరిక కలిగింది. మారువేషంతో భూలోకానికి వెళ్లింది. నారేళ్ళనాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి, సేవచేసి 11 రోజుల తరువాత సకలైశ్వర్యాలు కలగజేసి చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. అయిదేళ్ళ తరువాత అమ్మకు నారేళ్ళనాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ళనాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకొంటోంది. పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచి నీళ్ళడిగింది. నారేళ్ళనాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తనవారితో చెప్పింది. అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అది సాధ్యపడదన్నాడు శివుడు. విష్ణువూ తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ళనాచికి తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరుల ముందు ప్రాయశ్చిత్తం కోరిందట.
Also Read: ఈ వారం ఈ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ సమయం, జూన్ 26 నుంచి జూలై 2 వారఫలాలు
చాతుర్మాస్యం వ్రత నియమాలు
ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః
చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస) వారు పాటించవచ్చు. దీనికి కుల, వర్గ నియమాలు కానీ, లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వయుజ మాసంలో పాలను, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి . ఉసిరి కాయను వినియోగించవచ్చు. ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. వ్రతం చేసినన్ని రోజులు బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. పురాణ గ్రంధాలు చదువుకోవడం, యోగసాధన చేయడం, దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.