Tholi Ekadashi 2023: తొలి ఏకాదశి(జూన్ 29 ) ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!
ఏదైనా పనిని కొత్తగా ప్రారంభించేవారు తిథి చూసుకుంటారు. ఏకాదశి అని తెలిస్తే చాలు శుభం అంటారు. ఏకాదశికి ఉన్న ప్రత్యేకత అది. ఏడాది పొడవునా 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.
Tholi Ekadashi 2023: పూర్వకాలం తొలి ఏకాదశిని సంవత్సరానికి ఆరంభంగా పరిగణించేవారట. వానాకాలం మొదలయ్యే సమయం కావడంతో అనారోగ్య సమస్యలు, అంటు వ్యాధుల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అందుకే లంఖణం పరమ ఔషధం అన్నట్టు ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి
పురాణాల ప్రకారం
ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు. తొలిఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్లే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఈ యోగ నిద్ర ద్వారా...భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అనేందుకు సూచన.
Also Read: తొలిఏకాదశి (జూన్ 29) శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
ఏకాదశి పేరు ఎలా వచ్చింది
కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుంది. అప్పటి నుంచి ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చిందని చెబుతారు.
ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి
ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతారు.ఈ నాలుగు నెలల కాలాన్నీ అత్యంత పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్యదీక్ష చేస్తారు. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.
ఉపవాసం వల్ల శరీరంలో నూతనోత్తేజం
ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై శరీరం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.
Also Read: బక్రీద్ సందర్భంగా ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి!
పేలపిండి ప్రత్యేకం
ఏకాదశి రోజు పేల పిండిని తినే ఆచారం ఉంది. పేలాల్లో బెల్లం, యాలకులను చేర్చి ఈ పిండిని తయారుచేస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి శరీరానికి ఈ పిండి వేడి కలిగించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.