Pakistan Political Crisis: ఇమ్రాన్ ఖాన్ కౌంట్ షురూ- అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలు
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్షాలు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి విపక్షాలు. ప్రతిపక్ష నేత షెబాజ్ షరీఫ్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
పాక్ జాతీయ అసెంబ్లీ నియమాల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన మూడు రోజుల లోపు ఓటింగ్ నిర్వహించకూడదు. అలానే ఏడు రోజుల లోపు ఓటింగ్ ముగించాలి.
ఇమ్రాన్ ఏం చేస్తారు?
మరోవైపు అవిశ్వాస తీర్మానం గండం నుంచి తప్పించుకునేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా మద్దతును కూడగట్టేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా ఇమ్రాన్ ఖాన్ ఓ బహిరంగ సభను పెట్టారు. అయితే ఇందుకు ప్రతిగా ప్రతిపక్షాలు కూడా ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపడుతున్నాయి.
మరోవైపు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ కైజర్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలో కావాలనే స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతు కూడగట్టుకునేందుకు స్పీకర్ సాయం చేస్తున్నారన్నారు.
నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను గద్దెదించే ఉద్యమానికి సహకరిస్తామని తేల్చిచెప్పాయి. మరోవైపు అవిశ్వాసానికి ముందే సొంత పార్టీ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే 24 మంది చట్టసభ్యులు అవిశ్వాసానికి మద్ధతు ప్రకటించి ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతిస్తామని చెప్పిన మిత్రపక్షాలు కూడా హ్యాండ్ ఇచ్చాయి.
అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనను కూడా ఇమ్రాన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంత కావాలి?
మొత్తం 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. అయితే దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం ఉంచుకోగలిగింది. ఇప్పుడు మిత్రపక్షాల దూరంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇమ్రాన్ ఖాన్ క్రికెట్‌లో చేసినట్లు ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.