(Source: ECI/ABP News/ABP Majha)
VK Pandian: ఒడిశాలో తమిళ ‘ఒకే ఒక్కడు’, నవీన్ పట్నాయక్‌ను మెప్పించిన ఘనుడు
VK Pandian: గత కొద్ది కాలంగా ఒడిశా రాజకీయాల్లో ఎక్కువ సార్లు వినిపిస్తున్న పేరు వీకే పాండియన్. ఒడిశా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న పాండియన్ బీజేడీకి కాబోయే చీఫ్ అంటూ ప్రచారం జరుగుతోంది.
VK Pandian: గత కొద్ది కాలంగా ఒడిశా రాజకీయాల్లో చాలా ఎక్కువ సార్లు వినిపిస్తున్న పేరు వీకే పాండియన్. ఒడిశా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న పాండియన్ బీజేడీ (బిజూ జనతా దళ్)కు కాబోయే చీఫ్ అంటూ ప్రచారం జరుగుతోంది. 2002 బ్యాచ్‌కి చెందిన ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. కొన్నాళ్ల క్రితం వరకు ఆయన కెమెరా ముందు మాట్లాడానికి ఇబ్బంది, మొహమాట పడే వ్యక్తి ఇప్పుడు అన్ని మీడియా పాయింట్లలో ప్రధానంగా కనిపిస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయనకు ఒక మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
తమిళనాడుకు చెందిన పాండియన్, ఒడిశాలోని కేంద్రపారాకు చెందిన అతని IAS బ్యాచ్‌మేట్ సుజాతను వివాహం చేసుకున్నారు. నవీన్ పట్నాయక్ ప్రైవేట్ సెక్రటరీ అయిన పాండియన్ ఒడిశా పవర్ సెంటర్‌గా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర పరిపాలన అయినా, పట్నాయక్ బిజూ జనతా దళ్ (BJD) అయినా, పాండియన్ ఆమోదం లేకుండా ఏదీ జరగదనేది విస్తృత ప్రచారం. ఒడిశాలో చాలా మంది ప్రజలు ఆరాధించే నవీన్ పట్నాయక్‌కు పాండియన్‌పై ఉన్న నమ్మకం అలాంటిది మరి.
గంజాం జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యదర్శి వరకు ఎదిగిన తీరు అందరిని ఆశ్చర్య పరుస్తుంది. స్వచ్ఛంద పదవీ విరమణకు (VRS) కోసం పాండియన్ దరఖాస్తు చేసుకోగా మూడు రోజుల్లో సోమవారం (అక్టోబర్ 23) ఆమోదం వచ్చింది. మరుసటి రోజు మంగళవారం 5T (ట్రాన్స్‌ఫార్మేషనల్ ఇనిషియేటివ్స్), 'నబిన్ ఒడిశా' ఛైర్మన్‌గా నియమితులయ్యారు . దీంతో కేబినెట్ మంత్రి హోదాలో నియమితులైన ఆయన నేరుగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు నివేదించనున్నారు. అయితే బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు పాండియన్ నమ్మకమైన వ్యక్తిగా ఎలా మారారు? అతను ఇతర రాజకీయ నాయకులను ఎలా అధిగమించాడు? నవీన్ పట్నాయక్ వారసుడిగా ఆయనను అంచనా వేస్తున్నారా? మరి ముఖ్యంగా ఒడిశా ప్రజలు తమిళ వ్యక్తిని తమ నాయకుడిగా అంగీకరిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పాండియన్ ఎదిగిన తీరు ఇది..
2002లో కలహండి జిల్లాలో పాండియన్ ఉద్యోగాన్ని ప్రారంభించారు. అప్పుడు ఆయన వయసు 28 ఏళ్లు. తరువాత నక్సల్ ప్రభావిత ప్రాంతం మయూర్‌భంజ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత మరో రెండేళ్లలో నవీన్ పట్నాయక్ స్వస్థలమైన గంజాం జిల్లా కలెక్టర్‌గా పాండియన్ బాధ్యతలు చేపట్టారు. యువకుడైన పాండియన్ పనితీరుతో నవీన్ దృష్టిని ఆకర్షించాడు. నిజాయితీ, కార్యదక్షత, పనులను పూర్తి చేయగల సామర్థ్యం అతన్ని గుర్తించేలా చేశాయని ప్రముఖ రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ బ్రహ్మానంద సతపతి చెప్పారు. నవీన్ పట్నాయక్ 2011లో పాండియన్‌ను తన ప్రైవేట్ సెక్రటరీగా చేసుకున్నారు. ఆ తరువాత పాండియన్ పార్టీ నుంచి రాష్ట్ర యంత్రాంగం వరకు ప్రతిదీ నియంత్రించేవారు. ఆయన గ్రీన్ సిగ్నల్ లేకుండా ఏదీ కదలదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో సహా నవీన్ పట్నాయక్, ఇతర నాయకుల మధ్య జరిగిన కొన్ని క్లోజ్డ్ డోర్ సమావేశాలలో, గదిలో పాండియన్ మాత్రమే ఉన్నారు. సెప్టెంబరులో BJD పార్టీ వ్యవహారాల్లో పాండియన్ జోక్యాన్ని సౌమ్య రంజన్ పట్నాయక్ ప్రశ్నించారు. పర్యటనల కోసం పాండియన్ హెలికాప్టర్‌కు అయ్యే ఖర్చును చంద్రయాన్-3 ప్రాజెక్ట్ వ్యయంతో పోల్చారు. దీంతో సౌమ్య రంజన్ పట్నాయక్‌ను పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించారు.
నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరు?
నవీన్ పట్నాయక్ వయసు 77 ఏళ్లు. పెళ్లి చేసుకోలేదు. వారసులు లేరు. ఆయన కుటుంబం నుంచి కానీ, పెద్ద కుటుంబం నుంచి కానీ ఎవరూ పార్టీ పగ్గాలు చేపట్టరని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. BJD ఇప్పటి వరకు వారసత్వాన్ని ప్రకటించలేదు. నవీన్ పట్నాయక్ వారసుడు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని పరిశీలకులు చెబుతున్నారు. కొందరు మాత్రం పాండియన్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని, నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
పాండియన్ ఇప్పటికే ఒడిశాలోని 30 జిల్లాల్లో పర్యటించారు. ఒడిశా ప్రజలతో మంచి సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకున్నాడు. వారి మనోవేదనలను విని వారి సమస్యలను పరిష్కరించాడు. ప్రజలు అతన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని పలువురు చెబుతున్నారు. పాండియన్‌ను తదుపరి BJD చీఫ్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారనడంలో సందేహం లేదంటున్నారు. వీకే పాండియన్ తమిళుడు. ఒడిశా ప్రజలు ఆయనను తమ నాయకుడిగా అంగీకరిస్తారా? ప్రశ్నలకు 2024 ఎన్నికలే సమాధానం చెబుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నవీన్ పట్నాయక్‌కు ప్రజల మద్దతు ఉంది. అందుకే 2000 నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తక్కువ మాట్లాడతారని, ఎక్కువ పని చేస్తారని అక్కడి నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం పాండియన్ ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. నవీన్ పట్నాయక్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించకపోవడంతో పాండియన్ ఆయనను భర్తీ చేస్తున్నారు. పాండియన్‌ను ముఖ్యమంత్రికి ప్రాక్సీగా చూస్తున్నారని, పాండియన్ సైతం పలు అభివృద్ధి పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా సాధారణ ప్రజల నుంచి కూడా ఆయనకు మంచి ఆదరణ లభిస్తోందని బిసోయ్ చెప్పారు.
ఒడిశా ప్రజలు ఉదారవాదులు అని పాండియన్ అధికారంలో ఉండటంతో రాష్ట్రం, పార్టీ, వ్యక్తులు ఎలా ప్రయోజనం పొందుతారనే దానిపై సాధారణ ప్రజల ఆమోదం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాండియన్ తమిళుడు అయినా ఒడిశాకు అల్లుడు అని, 20 సంవత్సరాలకు పైగా ఇక్కడ పనిచేశాడని చెబుతున్నారు. పాండియన్ ఉచ్చారణలో తప్పును కనుగొనవచ్చు, కానీ అతను చాలా మంది రాజకీయ నాయకుల కంటే బాగా ఒడియా మాట్లాడతాడని స్థానికులు చర్చించుకోవడం విశేషం.