మారని పాక్ బుద్ధి.. ఎల్ఓసీలో మళ్లీ కాల్పులు.. ధీటుగా బదులిచ్చిన భారత్
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వరుసగా మూడోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శనివారం భారత జవాన్లపై కాల్పులు జరిగిన దాయాది సైన్యం.. ఆదివారం అర్ధరాత్రి సైతం కాల్పులకు తెగబడింది.

Pakistan Violates Ceasefire: పాకిస్తాన్ సైన్యం తీరు మారడంలేదు. నియంత్రణ రేఖ వెంబడి వరుసగా మూడోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శనివారం భారత జవాన్లపై కాల్పులు జరిగిన దాయాది సైన్యం.. ఆదివారం అర్ధరాత్రి సైతం కాల్పులకు తెగబడింది. టుట్మారి గలి, రాంపూర్ సెక్టార్లకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపాయని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. వారి కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిందని పేర్కొంది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులకు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 26 మందిని పొట్టనపెట్టుకున్న అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. దాయాది సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది.
ఇద్దరు టెర్రరిస్టుల అరెస్ట్
పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ జవాన్లు మూకుమ్మడి ఆపరేషన్‌లో కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఖైమోలోని మతల్హామా చౌక్ థోకెర్‌పోరాలో తనిఖీలు చేస్తూ ఇద్దరు టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మీడియా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఆ ఉగ్రవాదులను బిలాల్ అహ్మద్ భట్, మొహమ్మద్ ఇస్మాయిల్ భట్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు పిస్టల్స్, రెండు పిస్టల్ మ్యాగజైన్లతోపాటు 25 రౌండ్ల పిస్టల్ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నారు.
సోషల్ యాక్టివిస్ట్‌ను కాల్చిచంపిన టెర్రరిస్టులు
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన గులామ్ రసూల్ మాగ్రే (45) అనే సోషల్ యాక్టివిస్ట్‌ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. కందిఖాస్లోని అతడి ఇంట్లోకి ఆదివారం రాత్రి చొరబడ్డ ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని కుటుంబసభ్యులు అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
పర్యాటకులపై దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. భారత సైన్యం టెర్రరిస్టుల కోసం ముమ్మరంగా గాలిస్తోంది. గురువారం బండిపోరాలోని ఒక చెక్‌పాయింట్ వద్ద పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి ఒక చైనీస్ పిస్టల్, రెండు మ్యాగజైన్‌లు, అనేక రౌండ్ల బుల్లెట్స్, హ్యాండ్ గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు. కుప్వారాలోని లష్కరే తోయిబా ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ ఇంటిని పేల్చివేశారు.





















