Amitabh Bachchan: ఫేస్‌బుక్‌లో బిగ్ బీ అమితాబ్ ఎంప్టీ మెసేజెస్ - అదే కారణమా?
Pahalgam Terror Attack: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బిగ్ బీ అమితాబ్ తన ఫేస్‌బుక్‌లో ఎంప్టీ మెసేజ్‌లు పంపించడంపై చర్చ జరుగుతోంది. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Amitabh Bachchan Blank Messages On Facebook: పహల్గాం ఉగ్ర దాడి యావత్ దేశాన్నే షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ఉగ్రమూకల కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను దేశంలోని సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. ఇది అమానవీయం, ఆటవికం అంటూ మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్టులు పెట్టారు.
బిగ్ బీ ఎంప్టీ మెసేజెస్
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బిగ్ బీ 'అమితాబ్ బచ్చన్' (Amitabh Bachchan) గత 4 రోజులుగా ఫేస్ బుక్ వేదికగా ఎంప్టీ మెసేజెస్ పెడుతున్నారు. అమితాబ్ ఎందుకిలా చేస్తున్నారంటూ ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఆయన ఇలా మెసేజ్‌లు చేస్తున్నారంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఉగ్ర మూకల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. అందుకే బిగ్ బీ ఇలా ఎంప్టీ మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అమితాబ్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
అటు, ప్రకాష్ రాజ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని.. కశ్మీర్‌పై జరిగిన దాడి అని అన్నారు. 'ఏప్రిల్ 22, 2025 పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్ధం ఆవరించిన రోజు. ప్రశాంత ప్రకృతి వాతావరణంలో అలరారుతున్న ప్రదేశంలో నెత్తురు చిందిన రోజు. ప్రతీ కశ్మీరీ గుండె పగిలింది. క్రూరమైన ఈ చర్యను చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. ఈ ఆటవిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు. కశ్మీర్‌పై దాడి.' అని అన్నారు.
Also Read: కామెడీ నుంచి యాక్షన్ వరకూ.. - ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో మూవీస్, సిరీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి!
కశ్మీర్ ఇండియాదే..
పహల్గాం ఉగ్ర దాడిపై టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఘాటుగా స్పందించారు. 'కశ్మీర్‌లో ఇట్లాంటివి (పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనను ఉద్దేశిస్తూ...) అతున్నాయి కదా! దానికి సొల్యూషన్ ఆ (పాకిస్తాన్) కొడుకులకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. పాక్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదు. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద వాళ్లే ఎటాక్ చేస్తారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే! 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పని లేకుండా కొట్లాడుతున్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి. కశ్మీర్ ఇండియాదే. కశ్మీరీస్ మనోళ్లే.' అని విజయ్ అన్నారు.
ఉగ్రదాడి తర్వాత పాక్ హీరోలు, వారు నటించిన మూవీస్ ఇండియాలో బ్యాన్ చేయాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి. దీంతో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ (Fawad Khan) నటించిన బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్'ను (Abir Gulaal Movie) భారత్ బ్యాన్ చేసింది. ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచే వ్యతిరేకత మొదలు కాగా.. పుల్వామా దాడి తర్వాత పాక్ నటులు ఇండియన్ సినిమాల్లో నటించడం మానేశారు. చాలా గ్యాప్ తర్వాత పాక్ నటుడు ఫవాద్ ఈ సినిమాలో నటించారు. అయితే, తాజాగా పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ మూవీపై నిషేధం విధించారు.





















