New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు
Union Budget 2025 | దేశంలో తీసుకురానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన బిల్లుకు ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Union Cabinet approves new Income Tax Bill | న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025-26 సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా కొత్త చట్టానికి సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) శుక్రవారం ఆమోదం తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమై, కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. దేశంలో 1961 నుంచి ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టాలను మరింత సరళీకరణ చేసి, మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
భారత్‌లో అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త ఆదాయపు పన్ను (New Income Tax) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు శుక్రవారం ఆమోదం తెలిపాయని.. వచ్చే వారం పార్లమెంటు ముందుకు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రానుందని సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం కంటే అమలులోకి రానున్న కొత్త చట్టంలో లీగల్ సమస్యలు తగ్గుతాయి. ట్యాక్స్ చట్టాలు సవరించడంతో పాటు సరళీకరణతో ట్యాక్స్ పేయర్లకు ప్రయోజనం ఉంటుందని ఫైనాన్స్ సెక్రటరీ గురువారం స్పష్టం చేశారు.
రూ.12.75 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ రీబేట్
ఉద్యోగులకు, మధ్య తరగతి ట్యాక్స్ పేయర్లకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. 12 లక్షల వరకు ఆదాయంపై ఇన్‌కం ట్యాక్స్ లేదని (Tax Rebate) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. రూ.75 స్టాండర్డ్ డిడక్షన్ సైతం ఇస్తారు. అంటే మీరు సంపాదన రూ.12.75 లక్షల వరకు ఆదాయపు పన్ను కట్టనవసరం లేదని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి స్పష్టమైన బిల్లు, చట్టానికి సంబంధించిన నియమాలపై ట్యాక్స్ పేయర్లలో ఉత్కంఠ నెలకొంది. కేంద్రం నుంచి నియమ, నిబంధనలు విడుదల ఎప్పుడు అవుతాయా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టంలో వ్యక్తిగత, కంపెనీలు, హిందూ అవిభాజ్య కుటుంబం (Hindu Undivided Family), అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, కో ఆపరేటివ్ సోసైటీలు అంటూ పలు రకాల ఆదాయపు పన్ను చెల్లింపు వర్గాలున్నాయి. అందర్నీ ఏకతాటిపైకి తేవాలని, చట్టాలు సులభంగా ఉండాలని కొత్త ఐటీ చట్టాన్ని తెస్తున్నట్లు కేంద్రం చెబుతోంది.
రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతున్నాయి. జనవరి 31న ప్రారంభమైన తొలి విడత సెషన్స్ ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. రెండో విడత బడ్జెట్ సెషన్స్ మార్చి 10నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయని తెలిసిందే. కార్పొరేట్ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పన్ను, డైరెక్ట్ ట్యాక్స్, గిఫ్ట్ అండ్ వెల్త్ ట్యాక్స్ లాంటి వాటితో 23 చాప్టర్స్, 298 సెక్షన్లు ఆదాయపు పన్ను చట్టం, 1961లో ఉన్నాయి. ఇన్‌కం ట్యాక్స్ చట్టాన్ని అందరూ సులభంగా అర్థం చేసుకునేలా స్పష్టంగా, సరళంగా ఉండాలని కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు స్వీకరించి కొత్త ఆదాయపు పన్ను బిల్లు రూపొందించింది.
Also Read: Budget 2025 : బడ్జెట్‌లో కొత్త పన్ను రేట్లతో నిజంగానే లాభముందా - ప్రభుత్వానికి వచ్చే నష్టమెంతంటే..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

