Hyderabad News: కోకాపేటలో సాఫ్ట్ వేర్ కంపెనీ క్యాంటిన్‌లో పేలిన సిలిండర్ - పలువురు ఉద్యోగులకు గాయాలు
Kokapet : కోకాపేటలోని జీఏఆర్ టవర్స్ లోని భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. క్యాంటీన్ లో సిలిండర్ పేలడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగాతెలుస్తోంది.

Gar Towers Fire: హైదరాబాద్ కోకాపేటలో ఉన్న జీఎఆర్ టవర్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ భవనంలో ఉన్న క్యాంటిన్ లో సిలిండర్ పేలుడు వల్ల ఒక్క సారిగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఈ భవనంలో పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రమాదం కారణంగా పలువురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. శనివారం కావడంతో ఉద్యోగుల హాజరు తక్కువగా ఉంది. ఈ కారణంగా ప్రమాద తీవ్రత తగ్గినట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. భవనంలో ఉన్న ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగుల్ని వెంటనే బయటకు పంపేశాయి.
మొత్తంగా ఆరుగురు ఉద్యోగులకు గాయాలయినట్లుగా తెలుస్తోంది. ఆ ఉద్యోగుల ముఖాలకు బలమైన గాయాలయినట్లుగా సహోద్యోగులు చెబుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆస్పత్రి కానీ.. ఆ కంపెనీల యాజమాన్యం కానీ ప్రకటన చేయలేదు. అయితే గాయపడిన ఉద్యోగుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మామూలు గాయాలయిన కొంత మందికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీల భవనాల్లో రెస్టారెంట్లకు అనుమతి ఉండదు. అలాగే క్యాంటీన్లు ఉన్నప్పటికీ గ్యాస్ సిలిండర్లకు అనుమతి ఇవ్వరు. ఎలక్ట్రిక్ కుక్కర్లతోనే వంటలు.. వేడి చేసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. అయితే జీఏఆర్ భవనంలోకి గ్యాస్ సిలిండర్ ను ఎలా అనుమతించారన్నది తెలియాల్సి ఉంది. ఆ భవనం సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు రెస్టారెంట్ నిర్వహించుకోవడానికి.. క్యాంటీన్ లో గ్యాస్ వినియోగించుకోవడానికి అనువుగా నిర్మించారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో జీఏఆర్ టవర్స్ లో ఉన్న సాఫ్ట్ కంపెనీల ఉద్యోగులు టెన్షన్ కు గురయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

