Consumer Rights: మీ చేతిలో ఐదు ప్రధాన హక్కులు - మోసం చేసిన కంపెనీని ఓ ఆట ఆడుకోవచ్చు
Rights Of A Consumer: ఈ రోజు (మార్చి 15), ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, మనకు బాగా ఉపయోగకరంగా ఐదు ముఖ్యమైన హక్కుల గురించి తెలుసుకోండి.

World Consumer Rights Day 2025: మార్కెట్ నుంచి లేదా ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు, అవి ఒక్కోసారి సరిగా పని చేయవు లేదా లోపభూయిష్టంగా ఉంటాయి. లేదా, గరిష్ట చిల్లర ధర (MRP) కంటే ఎక్కువ రేటు చెల్లించమని అడుగుతారు. ఇప్పుడు, చాలా మంది నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ అన్ని కారణాల వల్ల వినియోగదారులు మోసపోతున్నారు లేదా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి వినియోగదారుల హక్కులు ఉపయోగపడతాయి. ఏటా మార్చి 15న "ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం" జరుపుకుంటాం.
మీ దైనందిన జీవితంలో మీకు ఉపయోగపడే ఐదు ముఖ్యమైన వినియోగదారుల హక్కులు ఇవి:
భద్రత హక్కు (Right to protection)
ప్రాణాలకు, ఆస్తికి ప్రమాదకరంగా పరిణమించే వస్తువులు & సేవలను నివారించే హక్కు వినియోగదారుకు ఉంటుంది. ఇలాంటి ప్రమాదకర ఉత్పత్తుల లిస్ట్‌లో చాలా అంశాలు ఉంటాయి. ఆహార పదార్థాలు కావచ్చు, నాణ్యత లేని ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, నకిలీ మందులు కావచ్చు లేదా మోసపూరిత ఆసుపత్రి సేవలు కావచ్చు. వీటన్నింటి నుంచి రక్షణ పొందే హక్కు వినియోగదారులకు ఉంది.
సమాచార హక్కు (Right to Information)
ఓ వ్యక్తి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని పొందే పూర్తి హక్కు అతనికి ఉంది. అంతేకాదు, అతను ఏదైనా సేవ కోసం డబ్బు చెల్లించినప్పుడు, ఆ సేవ గురించి ప్రతి సమాచారాన్ని పొందే హక్కు అతనికి ఉంది. ఇందులో ఆ ఉత్పత్తి లేదా సేవ ధర, నాణ్యత, పరిమాణం, షెల్ఫ్ లైఫ్, గడువు తేదీ మొదలైనవి ఉంటాయి. ఇది కాకుండా, ఏదైనా ఉత్పత్తిపై ఏదైనా సమాచారం మిస్ అయినా ముద్రించకుండా వదిలేసినా దాని గురించి తెలుసుకునే హక్కు కూడా వినియోగదారుకు
ఎంచుకునే హక్కు (Right to choose)
ఏ వినియోగదారుడికైనా తనకు కావలసిన ఉత్పత్తి లేదా సేవను ఎంచుకునే హక్కు ఉంటుంది. దుకాణదారుడు లేదా ఏ బ్రాండ్ కూడా అతనిని తమ ఉత్పత్తిని లేదా నిర్దిష్ట ఉత్పత్తిని కొనమని బలవంతం చేయకూడదు. మొబైల్ కంపెనీ, బ్యాంకింగ్ సేవలు, బీమా పాలసీలు లేదా సూపర్ మార్కెట్ ఇలా ఎలాంటి సంస్థ లేదా వ్యాపారి లేదా వారి ప్రతినిధి ఫలానా వస్తువును మాత్రమే కొనమని బలవంతం చేయలేరు.
వాదనలు వినిపించే హక్కు (Right to hearing)
ఏదైనా ఉత్పత్తి లేదా సేవకు సంబంధించి ఒక వినియోగదారుడు మోసపోయాడని అనుకుందాం. ఆ వినియోగదారుడు తన ఫిర్యాదును నమోదు చేయడానికి & దానిపై విచారణ జరిపించాలని అభ్యర్థించడానికి కూడా పూర్తి హక్కును కలిగి ఉంటాడు. ఇలాంటి విషయాల కోసం వివిధ స్థాయుల్లో వినియోగదారుల ఫోరాలు (Consumer forums) ఏర్పాటై ఉన్నాయి, వినియోగదారుడు తన ఫిర్యాదును వాటిలో నమోదు చేయవచ్చు.
న్యాయం పొందే హక్కు (Right to justice)
ఏదైనా కంపెనీ లేదా ఎవరైనా వ్యక్తి ఒక వినియోగదారుడికి నాణ్యత లేని సేవ లేదా ఉత్పత్తిని అమ్మినప్పుడు, ఆ ఉత్పత్తి లేదా సేవను వినియోగించుకోవడం వల్ల ఆ వినియోగదారుడు నష్టపోతే, దానికి నష్ట పరిహారం పొందే హక్కు కూడా వినియోగదారుడికి ఉంది. వినియోగదారుడు తన ఫిర్యాదును వినియోగదారుల వివాద పరిష్కార ఫోరంలో నమోదు చేసుకోవచ్చు. అక్కడ, ఈ విషయంపై విచారణ జరుగుతుంది & వినియోగదారుడికి జరిగిన నష్టానికి తగిన పరిహారం లభిస్తుంది.





















