Republic Day 2024: బ్రిటిష్ చట్టాలను దాటుకుని భారత్ గణతంత్ర దేశంగా ఎలా అవతరించిందంటే!
Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవం.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1947 ఆగస్టు 15 తరువాత మరో అత్యంత చారిత్రాత్మకమైన రోజు.
Republic Day Special: గణతంత్ర దినోత్సవం (Republic Day) .. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1947 ఆగస్టు 15 తరువాత మరో అత్యంత చారిత్రాత్మకమైన రోజు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో కొద్ది కాలంపాటు బ్రిటిష్ రూల్స్ నడిచాయి. 1950 జనవరి 26 అంబేద్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు రచించిన రాజ్యాంగం (Constitution) అమలులోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న బ్రిటిస్ రూల్స్ (British Rule) నుంచి భారత్ పూర్తి సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఇది దేశ చరిత్రలో మరో మైలు రాయి. ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా యావత్ దేశం జరుపుకుంటోంది.
భారతదేశ రాజకీయ క్యాలెండర్‌లో జనవరి 26కి ప్రత్యేక స్థానం ఉంది. 1929లో బ్రిటిష్ పాలన ప్రతిపాదించిన డొమినియన్ హోదాను తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ 'పూర్ణ స్వరాజ్' ప్రకటించింది. అప్పటి నుంచి భారత్ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్య దేశం కోసం ఉద్యమం ఊపందుకుంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలిగే రాజ్యాంగ నిర్మాణానికి దారితీసింది.
1920లో ప్రారంభమైన ద్విసభ కేంద్ర శాసనసభకు సభ్యులను ఎన్నుకోవడానికి జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు గణతంత్ర భారత్ ఆవిర్భావనికి బీజం పడేలా చేశాయి. ఫిబ్రవరి 9, 1921న జరిగిన డ్యూక్ ఆఫ్ కన్నాట్ ఆధ్వర్యంలో ఢిల్లీలో పార్లమెంట్ ప్రారంభమైంది. దశాబ్దాల తర్వాత ఆవిష్కృతమయ్యే చారిత్రాత్మకమైన మార్పులకు పార్లమెంట్ నాంది పలుకుతుందని తెలియదు.
ఆగష్టు 15, 1947న స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా బ్రిటిష్ ప్రభుత్వంతో భారతదేశం అనుబంధం కొనసాగింది. 1935 భారత ప్రభుత్వ చట్టంతో స్వాతంత్ర్యం తర్వాత మరో మూడు సంవత్సరాల పాటు తాత్కాలిక రాజ్యాంగంగా ఉపయోగించుకుంటూ దేశాన్ని పరిపాలించింది. అప్పటికే భారత్ తన రాజ్యంగ రచనకు పూనుకుంది. గణతంత్ర భారత్ దిశగా అడుగులు వేసింది. కొత్త రాజ్యాంగం రచించడం ద్వారా బ్రిటిష్ చట్టాలకు ముగింపు పలకవచ్చని భావించింది.
జనవరి 26, 1950న, భారత రాజ్యాంగం 1935 నాటి కలోనియల్-ఎరా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ స్థానంలో అమలులోకి వచ్చింది. దీంతో భారత్ గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. బ్రిటిష్ విధేయత, చట్టాల నుంచి రిపబ్లిక్ భారత్ ఏర్పాటును సూచిస్తూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ముసాయిదా ప్రక్రియపై సుమారు మూడు సంవత్సరాల పాటు శ్రమించిన రాజ్యాంగ సభ, 1951-52లో మొదటి సాధారణ ఎన్నికలను నిర్వహించే నాటికి భారత పార్లమెంటుగా మారింది. ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. కొత్త రాజ్యాంగంపై 2 ఏళ్ల 11 నెలల 17 రోజుల పాటు చర్చలు, సవరణలు జరిగాయి. ఈ కాలంలో 11 సెషన్‌లు జరిగాయి, నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించడంతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాంది పలికింది.
"భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందించాలని, పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాము" అని కొత్తగా రూపొందించబడిన భారత రాజ్యాంగం ప్రవేశికలో పేర్కొన్నారు.
అప్పటి నుంచి న్యూ ఢిల్లీలో సైన్యం కవాతు, గౌరవ వందనం, సైనిక విన్యాసాలతో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. 1950లో దేశ రాజధానిలోని పురానా ఖిలా ఎదురుగా ఉన్న ఇర్విన్ యాంఫీథియేటర్‌లో తొలి రిపబ్లిక్ డే పరేడ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహాతంగా కొనసాగుతోంది. రాజ్యాంగాన్ని ఆమోదించడంతోనే జనవరి 26 ప్రాముఖ్యత ముగియలేదు. అప్పటి నుంచే బ్రిటిష్ సామ్రాజ్యంతో ఉన్న సంబంధాలను తెంచుకోవడంలో కూడా ఉంది.